ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూలు
విజయవాడ స్పోర్ట్స్ :రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.315 కోట్లతో స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వీసీ అండ్ ఎండీ కె.ఆర్.వి.హెచ్.ఎన్.చక్రవర్తితెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోని రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్‌తో జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూళ్లను అనుసంధానం చేస్తామన్నారు. రాజీవ్ ఖేల్ అభియాన్ ద్వారా ప్రతి మండలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం వంటి అంతర్జాతీయస్థాయి సదుపాయాలు ఉన్న స్టేడియాల నిర్మాణం ఇక్కడా జరగాల్సి ఉందన్నారు. విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతిలలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాలు ఏర్పాటు చేస్తామన్నారు.
నగరంలోని క్రీడా మైదానాలు, మౌలిక వసతులను ఆయన డీఎస్డీఓ పి.రామకృష్ణతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే 2017 నేషనల్ గేమ్స్‌ను బిడ్ ద్వారా ప్రాథమికంగా గోవా రాష్ట్రానికి కేటాయించారని, అయినా విభజన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని చెప్పారు. కనీసం 2019లో నేషనల్ గేమ్స్‌ను ఏపీలో నిర్వహించడానికి గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో శాప్ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుకు స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. సుమారు రూ.45 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్రంలో ఆధునిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ ఫీల్డ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
రాష్టంలో క్రీడాభివృద్ధికి దాతలు, కార్పొరేట్ సంస్థల సాయం కోరతామన్నారు. వారిచ్చే నిధులకు టాక్స్ మినహాయింపు ఇస్తామన్నారు. స్టేడియాలకు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.50 వేలకు పైగా నిధులు ఇచ్చే దాతల పేర్లు పెట్టడం, లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇవ్వడం వంటి పద్ధతులు అవలంబిస్తామని తె లిపారు. జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి ఇసుక సీనరేజ్ (3 శాతం), ప్రాపర్టీ టాక్స్ (3 శాతం), ఎక్సైజ్ శాఖ (5 శాతం) నిధులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సమకూరేలా జీఓలను అమలు చేస్తామని వివరించారు. కోచ్‌ల ప్రతిభ ప్రకారం మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని, విద్యాధరపురంలో స్టేడియం కోసం కేటాయించిన స్థలాన్ని చక్రవర్తి పరిశీలించారు.