చివరికి గుట్టు విప్పిందిలా...
న్యూఢిల్లీ: రోజూ తాగి వచ్చి ఒళ్లు హూనం చేస్తుంటే విసిగి వేసారిన ఓ మహిళ తన భర్తను మట్టుపెట్టింది. తర్వాత కామ్‌గా పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆ విషయాన్ని మనసులో దాచుకోలేకపోయింది. బంధువులకు చెప్పగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలో నివసించే సీమ (34), భరద్వాజ్ భార్యాభర్తలు. భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తాడు. వీరికి ఒక కూతురు (10), కొడుకు (7) ఉన్నారు. సీమను భర్త రోజూ తాగివచ్చి వేధించేవాడు. మానసికంగా, శారీకరంగా హింసించేవాడు. ఆగస్టు15 న మళ్లీ అతడు తాగి రావడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సహనం నశించిన ఆమె తాగిన మత్తులో మునిగిన భర్తను గొంతు పిసికి చంపేసింది. 24 గంటల పాటు మంచం కింద దాచి ఉంచింది. మర్నాడు ఉదయం పిల్లల్ని స్కూలుకు పంపిన తరువాత, భర్త శవాన్ని గుట్టుగా ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో వేసేసింది. తర్వాత పనివాళ్లను పిలిపించి సిమెంటుతో ట్యాంకు మూయించేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అలా 5 రోజులు గడిచిపోయాయి. కానీ ఈ విషయాన్ని ఎంతోకాలం రహస్యంగా ఉంచలేకపోయింది. తన వదిన దగ్గిర గుట్టు విప్పేసింది. మొదట ఆమె నమ్మకపోయినా, తర్వాత విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేధింపులు తట్టుకోలేకే భర్తను హత్య చేశానని సీమ పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించింది.
దీంతో గురువారం సాయంత్రం సీమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమెదు చేశామని సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ తెలిపారు. సుమారు 20 అడుగుల లోతున్న ట్యాంక్ నుంచి మృతదేహాన్ని వెలికితీయడానికి రెండు గంటల సమయం పట్టిందన్నారు.