స్టూడెంట్ లైప్ @ ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా.. స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు ఉన్నత వేదిక! ఇంజనీరింగ్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వరకు వివిధ కోర్సుల్లో చేరేందుకు అక్కడికి వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో త్వరలో స్ప్రింగ్ సెషన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియా.. ఒకవైపు టాప్ యూనివర్సిటీలకు, మరోవైపు ఆహ్లాదకర పర్యాటక ప్రాంతాలకు నెలవు. కంగారూలకు కేరాఫ్ అయిన ఆస్ట్రేలియా వాతావరణంలో ఇమిడిపోయే విషయంలో కంగారు అనవసరం. విద్యార్థి జీవితాన్ని దిగ్విజయంగా పూర్తిచేయొచ్చు. అయితే దీనికి కొన్ని లక్షణాలు అలవరచుకోవాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడ్మిషన్ ఖరారు చేసుకున్న అభ్యర్థులు అకడమిక్‌గా, వ్యక్తిగతంగా మెలగాల్సిన తీరుపై విశ్లేషణ.
భిన్న సంస్కృతులు
ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో అమెరికా మొదలు అంగోలా వరకు వివిధ దేశాలకు చెందినవారు ఉంటారు. ఆసియా విద్యార్థులకు ఉత్తర ఆస్ట్రేలియా కేరాఫ్‌గా ఉంటోంది. అందువల్ల ఈ ప్రాంత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన భారతీయ విద్యార్థులకు అలవాటు పడే అంశంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పరాయి దేశంలో ఎక్కడ చదువుతున్నా కొన్ని ప్రత్యేక లక్షణాలను అలవరచుకోవాల్సిందే. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులతో మమేకమయ్యేందుకు ప్రాధాన్యమివ్వాలి. సంస్కృతి పరంగా వైవిధ్యమున్న వారితో కలిసిపోయే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.
ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు.. కొత్తగా చేరిన అంతర్జాతీయ విద్యార్థుల్లో భయం, బిడియం వంటివి పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. ౌఠ్ఛీ్ఛజుటగా పిలిచే ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్. దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకట్రెండు వారాలపాటు తరగతులు, లెక్చర్ల జోలికెళ్లకుండా.. ఆయా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఒకరి గురించి మరొకరికి తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కోర్సుల విధివిధానాలపైనా అవగాహన పెంపొందిస్తారు. ఇవి.. కొత్త విద్యార్థులకు.. అక్కడి వాతావరణంలో ఇమిడేందుకు ఎంతో ఉపయోగపడతాయి.
నివాస సదుపాయం
దేశం ఏదైనా విదేశీ విద్యార్థులు తొలుత దృష్టిసారించే అంశం.. నివాస సదుపాయం. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీలు ఆన్–క్యాంపస్ హౌసింగ్ పేరుతో క్యాంపస్ పరిధిలోనే హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నాయి. వీటిలో ఉండటం వల్ల క్యాంపస్‌లో నిరంతరం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆఫ్ – క్యాంపస్ విషయానికొస్తే విద్యార్థులు సొంతంగా షేరింగ్ విధానంలో నివాస సదుపాయం పొందొచ్చు. ఆన్–క్యాంపస్ విద్యార్థులతో పోల్చితే ఆఫ్–క్యాంపస్‌లో ఉంటున్న వారికి సోషల్ కల్చర్‌పై ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇది భవిష్యత్తులో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
స్వయంకృషి కీలకం
అకడమిక్, వ్యక్తిగత జీవితం విషయంలో సెల్ఫ్ డిపెండెన్సీకి ప్రాధాన్యమివ్వాలి. తరగతిగది లెక్చర్‌కు సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలంటే స్వయంకృషిపై ఆధారపడాల్సిందే. దీనికోసం క్యాంపస్ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఏవైనా సందేహాలుంటే ప్రొఫెసర్లను కలిసి, నివృత్తి చేసుకోవాలి. ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి ఇలాంటి దృక్పథాన్ని ఆశిస్తారు.
ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
కేవలం అకడమిక్స్‌కే పూర్తి సమయం కేటాయించి.. లైఫ్‌ను ఎంజాయ్ చేయడం లేదనే భావన రానీయకుండా యూనివర్సిటీలు విద్యార్థుల కోసం వివిధ ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారాంతాల్లో స్పోర్ట్స్ ఈవెంట్స్, గేమ్స్ వంటివి నిర్వహిస్తుంటాయి. అదే విధంగా గెస్ట్ లెక్చర్స్, గెస్ట్స్ స్పీక్స్ పేరుతో అకడమిక్ ఎక్సలెన్స్, మోటివేషన్ లెవల్స్ పెంచేలా ప్రముఖుల లెక్చర్స్ సదుపాయం కల్పిస్తుంటాయి. వీటిలో పాల్గొనడం వల్ల ఆయా రంగాల నిపుణులను సంప్రదించే అవకాశం లభిస్తుంది.
భాషా నైపుణ్యాలు
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి. స్థానిక భాషకు సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. యాస, షార్ట్‌కట్ పదాలను ఉపయోగించడాన్ని కూడా అలవరచుకుంటే స్వల్ప సమయంలోనే స్థానిక వాతావరణంలో ఇమిడిపోవచ్చు. వాస్తవానికి ఆన్ – క్యాంపస్, ఆఫ్ – క్యాంపస్‌లలో ఇంగ్లిష్ మాట్లాడే వారు అధికంగానే ఉన్నప్పటికీ.. స్థానిక భాష నేర్చుకోవడం వల్ల వర్క్ ఎట్ స్టడీ పేరుతో పార్ట్‌టైం జాబ్స్ చేయాలనుకునే వారికి అవకాశాలు మెరుగవుతాయి. అయిదారేళ్ల కిందటి వరకు ఆస్ట్రేలియాలోని అంతర్జాతీయ విద్యార్థులను జాత్యహంకార దాడుల భయం వెంటాడేది. కానీ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
ఖర్చు విషయంలో పొదుపుగా..
విదేశీ విద్యార్థులు ఖర్చు విషయంలో పొదుపుగా వ్యవహరించడం ఎంతో అవసరం. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజుల పరంగా యూఎస్, యూకేలతో పోల్చితే ఖర్చు కొంత తక్కువైనప్పటికీ.. నివాస ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. సాధారణంగా షేరింగ్ నివాసానికి ఏడాదికి ఏడు వేలు నుంచి తొమ్మిది వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు అద్దెలు ఉంటాయి. డైనింగ్, ఇతర హౌస్‌హోల్డ్ ఖర్చు నాలుగు వేల నుంచి అయిదు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు ఉంటుంది.
స్టూడెంట్ క్లబ్స్, స్టడీ గ్రూప్స్
నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవడానికి, నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవడానికి అంతర్జాతీయ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఇతర మార్గాలు.. స్టూడెంట్ క్లబ్స్, స్టడీ గ్రూప్స్. ఇవి.. అకడమిక్, కల్చరల్ సంబంధిత అంశాల్లో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో సభ్యత్వం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.
టాప్–5 ఉత్తమ నగరాలు
♦ మెల్బోర్న్లో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ సహా వివిధ ఉన్నత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య పరంగా ఈ నగరం ముందంజలో నిలుస్తోంది.
♦ ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ హబ్‌గా, దేశంలో విస్తీర్ణం పరంగా పెద్ద నగరంగా గుర్తింపు పొందిన సిడ్నీలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ – సిడ్నీ వంటి ప్రముఖ యూనివర్సిటీలు నెలకొన్నాయి.
♦ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డైవర్సిటీ పరంగా గుర్తింపు పొందిన ప్రాంతం కాన్బెర్రా. ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది.
♦ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వంటివి ముఖ్యమైన విద్యాసంస్థలు. పెద్దఎత్తున సహజ వనరులు, ఇంధన కంపెనీలకు నిలయమైన ఈ నగరంలో కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి.
♦ యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వంటి ముఖ్యమైన యూనివర్సిటీలు ఈ నగరంలో ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలమైన నగరంగా దీన్ని చెప్పొచ్చు.