న్యాయ సలహాలు విస్తృతంగా అందించాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాఘవరావు
లీగల్ (కడప అర్బన్) : ప్రజలకు లీగల్ లిటరసీ సంస్థ ద్వారా ఎక్కువ మందికి న్యాయ సలహాలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎస్.రాఘరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి 2011-12, 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు ఆడిట్ రిపోర్టును కమిటీ ఆమోదించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు మాసాలలో జిల్లాలో నిర్వహించిన లోక్‌అదాలత్, కేసుల పరిష్కారం, లిటరసీ క్యాంపుల నిర్వహణ, లీగల్ సర్వీసుల ద్వారా ఎంత మందికి న్యాయ సలహాలు అందించడం జరిగిందనే అంశాలపై సమీక్షించారు. లోక్ అదాలత్ ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
రాజంపేట పరిధిలో భూ సేకరణకు సంబంధించి ఎక్కువ వివాదాలు, రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నమోదవుతున్నందున రెవెన్యూ అధికారులతో సమన్వయ పరుచుకుని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో లీగ్-ఎయిడ్-క్లినిక్‌ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇందుకు జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ టి.రఘురాం, జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అన్వర్‌బాషా, జీపీ పి.సుబ్రమణ్యం, జె.ప్రభాకర్, అదనపుఎస్పీ (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.