RSWS 2022 Final: వెస్టిండీస్‌కు పరాభవం.. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్
RSWS 2022- Sri Lanka Legends vs West Indies Legends, Semi-final 2: సమిష్టి ప్రదర్శనతో శ్రీలంక లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్(ఆర్ఎస్డబ్ల్యూఎస్)- 2022 ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండీస్ లెజెండ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి.. ఇండియా లెజెండ్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. ఆల్‌రౌండర్లు ఇషాన్ జయరత్నె(19 బంతుల్లో 31 పరుగులు), నువాన్ కులశేఖర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఆర్ఎస్డబ్ల్యూఎస్ సెమీఫైనల్-2లో శ్రీలంక లెజెండ్స్- వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
రాణించిన జయరత్నె
బ్రియన్ లారా బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది దిల్షాన్ సేన. ఓపెనర్లు మహేల ఉదవటె(15), సనత్ జయసూర్య(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ మాత్రం(12 బంతుల్లో ఏడు పరుగులు) విఫలమయ్యాడు.
ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఇషాన్ జయరత్నె మెరుపులు మెరిపించగా.. జీవన్ మెండిస్ 25 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
పాపం నర్సింగ్!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ టాపార్డర్ రాణించినప్పటికీ.. మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో వన్‌డౌన్ బ్యాటర్ నర్సింగ్ డియోనరైన్ ఒంటరి పోరాటం(39 బంతుల్లో 63 పరుగులు) వృథాగా పోయింది. 158 పరుగులకే విండీస్ ఆలౌట్ కాగా.. శ్రీలంక 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది.
కీలక వికెట్లు పడగొట్టిన నువాన్ కులశేఖర(4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక శ్రీలంక లెజెండ్స్ శనివారం(అక్టోబరు 1) నాటి ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌తో తలపడనుంది.
చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు