రచ్చరచ్చ
హోరెత్తిన కౌన్సిల్ సమావేశం గద్దె డెరైక్షన్‌లో రసవత్తరంగా నడిచిన కనకదుర్గ లేఅవుట్ కథ ప్రతిపక్షాలను తోసిపుచ్చి ‘పచ్చ’జెండా ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్
అరుపులు.. కేకలు.. తోపులాటలతో బుధవారం కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా సాగింది. పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ ఆమోదం కౌన్సిల్‌ను కుదిపేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ, సీపీఎం సభ్యులు చర్చకు పట్టుబట్టినా టీడీపీ మొండిగా వ్యవహరించింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డెరైక్షన్‌లో కథంతా రసవత్తరంగా సాగింది. ఇదేంటని ప్రశ్నించిన తొమ్మిది మంది వైఎస్సార్ సీపీ సభ్యుల్ని సభ నుంచి బహిష్కరించారు. లేఅవుట్ ఆమోదంలో ఎలాంటి తప్పు లేదంటూ కొందరు టీడీపీ కార్పొరేటర్లు చప్పుట్లు చరుచుకున్నా.. తప్పు జరిగిందంటూ మూడు నెలల కిందట గగ్గోలు పెట్టిన మరికొందరు పెద్దల హుకుంతో నోరు మెదపలేదు.
విజయవాడ సెంట్రల్ : శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్‌ను కౌన్సిల్ ఆమోదించడం పెనుదుమారాన్నే రేపింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10.50 గంటలకు సభ ప్రారంభమైంది. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తుండగా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అభ్యంతరం చెప్పారు. గత కౌన్సిల్లో ఆమోదించిన శ్రీకనకదుర్గ లేఅవుట్ ధ్రువీకరణను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమోదాన్ని రద్దు చేయాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుడు జాస్తి సాంబశివరావు రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించారు. అక్కడ ఏ తప్పు జరగలేదన్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారన్నారు. టీడీపీ అంటించుకున్న అవినీతి బురదను తాము అంటించుకోలేమని పుణ్యశీల ఎద్దేవా చేశారు. సెక్షన్ 679 ప్రకారం అధికారాన్ని అధిగమించి నిర్ణయాలు తీసుకుంటే మేయర్ పదవిపోతుందని హెచ్చరించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు.
దొంగలు మీరంటే మీరు
టీడీపీ కార్పొరేటర్ ఆతుకూరి రవికుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ దొంగల పార్టీ అన్నారు. దీనిని వైఎస్సార్ సీపీ సభ్యుడు బుల్లా విజయ్ తీవ్రంగా ఖండించి ప్రతిఘటించారు. ‘ఓటుకు కోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడిన రేవంత్‌రెడ్డి మీ పార్టీలోనే ఉన్నాడు. మీదే దొంగల పార్టీ..’ అన్నారు.
ఈక్రమంలో రెండు పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో సభను 11.45కు పదినిమిషాల పాటు వాయిదా వేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరంగేట్రం చేశాక 12.10 గంటలకు సభ ప్రారంభమైంది. చర్చ జరపాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ ససేమిరా అన్నారు. దీంతో ఇరుపార్టీల సభ్యులు ఆరోపణలతో హోరెత్తించారు. టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. మధ్యాహ్నం 12.20కు మళ్లీ సభను వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
వైఎస్సార్ సీపీ సభ్యుల సస్పెన్షన్
మేయర్ చాంబర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ ఫ్లోర్‌లీడర్లు పుణ్యశీల, ఆదిలక్ష్మి, ఉత్తమ్‌చంద్ బండారీతో చర్చలు జరిపారు. లేఅవుట్ ఆమోదానికి సహకరించాల్సిందిగా కోరారు. పుణ్యశీల ససేమిరా అన్నారు. సుమారు గంటన్నర సేపు చర్చలు జరిపినప్పటికీ ప్రతిపక్షాలు మెత్తపడలేదు. వైఎస్సార్ సీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి మేయర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మేయర్ సభను ప్రారంభించారు.
పోడియం వదిలి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. చర్చ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, సభ్యులు ఆసిఫ్, బుల్లా విజయ్, బి.బహుదూర్, అవుతు శ్రీశైలజ, కరీమున్నీసా, బి.సంధ్యారాణి, జె.పూర్ణమ్మ, పి.సుభాషిణి లను సస్పెండ్ చేశారు. శ్రీకనకదుర్గ లేఅవుట్పై వైఎస్సార్ సీపీ, సీపీఎం ఇచ్చిన సవ రణ తీర్మానాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తోసిపుచ్చారు. లేఅవుట్ ఆమోదానికి అడ్డగోలుగా ‘పచ్చ’జెండా ఊపారు.