కలియుగదైవం కూడా రోజూ జమాఖర్చులు చూసుకుంటాడు!
గర్భాలయంలోని స్వయంవ్యక్త మూర్తి అయిన మూలవిరాట్టు అంశంగా భోగ శ్రీనివాసమూర్తికి నిత్యం ఆలయంలోని ఆదాయ, వ్యయాలకు సంబంధించిన జమాఖర్చుల లెక్కలన్నీ అప్పచెబుతారు. దీన్నే కొలువు లేదా దర్బార్ అని అంటారు. ఆలయంలో సుప్రభాత, తోమాల సేవలు ముగిసిన తర్వాత సన్నిధిలో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని బంగారు ఛత్ర చామరాలతో స్నపన మంటపంలో బంగారు సింహాసనంపై వేంచేపు చేసి దర్బారు నిర్వహిస్తారు. షోడశ ఉపచారాలు, ధూపదీప హారతులు సమర్పిస్తారు.
ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాస ప్రభువుకు పంచాంగ శ్రవణం చేస్తూ ఆ నాటి తిథివార నక్షత్రాదులు, ఉత్సవ విశేషాలు, వివిధ పథకాలకు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు వినిపిస్తారు. రికార్డుల గది లెక్కల గుమస్తా (బొక్కసం సెల్ ఇన్చార్జి) వచ్చి ముందు నాటి ఆదాయం, ఆర్జిత సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయం, హుండీ కానుకలు, బంగారు, వెండి, రాతి, ఇతర విలువైన లోహ పాత్రలు, నగదు నికర ఆదాయం పైసలతో సహా లెక్కకట్టి వడ్డీకాసులవాడైన శ్రీనివాసునికి వివరంగా అప్పగించి భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు. స్వామికి నైవేద్యం పెట్టిన అనంతరం దర్బార్ ముగిసినట్లు భావించి, భోగశ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలోకి భక్తిపూర్వకంగా తీసుకెళతారు. ఈ కొలువు సూర్యోదయానికి ముందు స్నపన మండపం, ప్రత్యేక సందర్భాల్లో సూర్యోదయం తర్వాత బంగారు వాకిలిలోని తిరుమామణి (ఘంటామంటపం) మంటపంలో నిర్వహిస్తారు.