నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం
నగరి: నగరిలో బుధవారం శ్రీనివాసకల్యాణం అంగరంగ వైభవంగా జరి గింది. తిరుమల వెళ్లి కలియుగ దైవమైన వెంకటేశుని కల్యాణాన్ని తిలకించలేని భక్తులు నగరి పట్టణంలోనే ఆ వైభవాన్ని తిలకించి మధురానుభూతిని పొందారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో భాగంగా నగరి డిగ్రీ కళాశాల మైదానంలో టీటీడీ ఏర్పాటు చేసిన భారీ వేదికపై కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణాన్ని ఉభయ నాంచారులతో అర్చకులు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామికి కొలువు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో, స్వర్ణాభరణాలతో అలంకరించారు.
వేదపండితులు ఆగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. సుముహుర్తానికి శ్రీదేవి, భూదేవితో శ్రీనివాసుని చేతుల నుంచి మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీనివాస కల్యాణంలో పా ల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కల్యాణోత్సవం సందర్భంగా కళాకారులు నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగరికి తిరుమల శోభను తెప్పించాయి. అలాగే టీటీ డీ వారు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
కల్యాణోత్సవ కార్యక్రమంలో తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసులురాజు, భాస్కర్, ప్రాజెక్టు ఆఫీసర్ రామచంద్రారెడ్డి, ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, జిల్లా ధర్మప్రచార్ మండల అధికారి రాజ్‌కుమార్, మాజీ మంత్రిరెడ్డివారి చెంగారెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, సీఐ నాగేశ్వరరెడ్డి, ఎస్ఐ ప్రసాద్, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.