రాష్ట్ర పారిశ్రామిక విధానం భేష్
పటాన్చెరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం గొప్పగా ఉందని పటాన్చెరు, రామచంద్రాపురం, పాశమైలారం పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ భవన్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యాప్సియా మాజీ అధ్యక్షుడు హనుమంతరావు, చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడు నర్సింగ్‌రావు, పటాన్చెరు ఐలా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కళా రమేష్, పారిశ్రామికవేత్తల సంఘం నాయకులు చంద్రమౌళి, దుర్గాప్రసాద్, గోకుల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇలాంటి పారిశ్రామిక విధానం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషిచేస్తూ ఎంతో మేలు చేసే పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఫ్యాప్సియా మాజీ అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర సీఎం రోశయ్య హయాంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం జీఓ బయటకు రావడానికే ఆరు నెలలు పట్టిందని గుర్తు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా కేసీఆర్ నాలుగు రోజుల్లోనే నాలుగు జీవోలను వెలువరించారని కొనియాడారు.
చైనా, గుజరాత్‌లను మించిన గొప్ప పారిశ్రామిక విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు నూతన పారిశ్రామిక విధానంలో ప్రోత్సాహకాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎకరా భూమికి రూ. 100 చొప్పున ఏడాదికి లీజు కింద భూ కేటాయింపులు జరుగుతాయన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 10 లక్షల సబ్సిడీ ఇస్తున్నారన్నారు. సర్వీసు టాక్స్, వ్యాట్, పవర్ రిబేటు తదితర రాయితీలన్నీ గొప్పగా ఉన్నాయన్నారు. గత పాలసీ కింద రాయితీలు పొందిన వారికి కూడా ప్రస్తుత ప్రభుత్వ పాలసీలో లబ్ధి చేకూర్చే అవకాశం కల్పించారన్నారు. బ్యాంకు రుణాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారన్నారు.
నిరుద్యోగుల సమస్యకు నూతన పారిశ్రామిక విధానం పరిష్కారం చూపుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు అడగని వాటికి కూడా రాయితీలు కల్పించాన్నారు. చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు నర్సింగ్‌రావు మాట్లాడుతూ గొప్ప పారిశ్రామిక విధానం తెచ్చారని కొనియాడారు. పారిశ్రామిక వేత్త చంద్రమౌళి మాట్లాడుతూ చెరువుల అభివృద్ధి పథకంతో విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు. ఆ విద్యుత్‌ను పరిశ్రమలకు అందించేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో పనిచేస్తున్నారన్నారు. పటాన్చెరు ఐలా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల సమస్యలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించి మంచి పాలసీ రూపొందించారన్నారు. కార్యక్రమంలో లఘుపరిశ్రమల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.