దశలవారీగా నగరాభివృద్ధి
మీట్ ది ప్రెస్‌లో మేయర్ రామ్మోహన్
సాక్షి, సిటీబ్యూరో: వచ్చేనెల 15వ తేదీనాటికి ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పనుల్ని ప్రారంభిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు సీఎం తగిన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పనులకు సంబంధించి రైల్వే, మిలటరీ అధికారులతోనూ సీఎం మాట్లాడారని, పనుల్ని ఏవిధంగా చేపట్టాలనే అంశం, నిధుల సమీకరణపై కూడా వారం రోజుల్లో స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. రహదారులు, నాలాలు తదితర సమస్యల పరిష్కారానికి ఎక్కడ మంచి విధానాలు ఉన్నా అధ్యయనం చేసి ఆచరిస్తామన్నారు. అవినీతినీ అంతమొందిస్తామన్నారు.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యల్ని ఒక్క రోజులోనే పరిష్కరిస్తామని గొప్పలు చెప్పబోమని, దశలవారీగా, క్రమేపీ నగరవాసుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘మీట్ దిప్రెస్’లో మేయర్ మాట్లాడారు. సిటిజన్ చార్టర్ మేరకు నిర్ణీత వ్యవధిలో ప్రజలకు సేవలందించేందు కు కృషి చేస్తామన్నారు. త్వరలో ఆన్లైన్లో భవననిర్మాణ అనుమతులు, డిజిటల్ ఇంటినెంబర్లను అందుబాటలోకి తెస్తామని చెప్పారు.
టౌన్‌ప్లానింగ్‌లో, ముఖ్యంగా బీఆర్ఎస్లో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిర్ణీత గడువు ముగిశాక నిర్మించిన వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఎన్ఆర్ఎస్ఏ సేవల్ని వినియోగించుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటుకు ప్రజల అభ్యంతరాలతో స్థల సేకరణ కష్టమవుతోందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.
మన్నికగా రహదారులు..
నగర రహదారులు 365 రోజులూ మన్నికగా ఉండేలా తగిన ప్రణాళికతో రోడ్ల పనులు చేపడతామన్నారు. రోడ్లను వేశాక తవ్వకుండా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల పనులు పూర్తయ్యాకే రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయినందున ఈసారి నీటి సమస్య తీవ్రంగా ఉందని, 20 టీఎంసీల రిజర్వాయర్ల పనులు పూర్తయితే వచ్చే సంవత్సరానికి నీటి బ్యాంక్ ఉంటుందన్నారు.
రోడ్లపై నిలిచిన నీరు ఎప్పటికప్పుడు తొలగిం చేందుకు, నాలాల నిర్మాణం దెబ్బతినకుండా నాలాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు తీసివేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. శివారు ప్రాంతా ల్లో డ్రైనేజీ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డుల ఆధ్వర్యంలో వెయ్యిప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి యజమానీ ఇంకుడుగుంత నిర్మించేలా చట్టం తేనున్నట్లు తెలిపారు. జూన్ 2 నాటికి మెట్రో రైలు పట్టాలెక్కేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులతో పాటు సెలబ్రిటీలు ఎందరో ముందుకు వచ్చారని, అందరి భాగస్వామ్యంతో దాన్ని విజయవంతం చేస్తామన్నారు. వందరోజుల పనులు 50 నుంచి 60 శాతం పూర్తయ్యాయని, జాబ్‌మేళాల్లో వివిధ కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాయని పేర్కొన్నారు.