మైక్రోసాఫ్ట్ కొత్త రకం ఫోన్లు..
శాన్ఫ్రాన్సిస్కో : సర్ఫేస్ పీసీ లైన్, విండోస్ ఫోన్ల రెవెన్యూలు భారీ ఎత్తున్న పడిపోయినప్పటికీ, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం మరో సరికొత్త రకం డివైజ్లను రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ డివైజ్లు ఏమిటో కాదు.. సర్ఫేస్ ఫోన్లంట. దీనికోసం మైక్రోసాఫ్ట్ పేటెంట్ హక్కులను కూడా తీసేసుకుందని తెలిసింది. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ విషయాన్ని ధృవీకరించారు. ''మైక్రోసాఫ్ట్ చాలా ఫోన్లను తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్ల మాదిరివి కావు'' అని నాదెళ్ల సోమవారం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్ అత్యుత్తమమైన మొబైల్ డివైజ్ను లాంచ్చేస్తుందని నాదెళ్ల ప్రకటించారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లీడర్ల మాదిరిగా కాకుండా.. ఫోన్ మార్కెట్లో తాము కొనసాగుతామని తెలిపారు. తాము తయారుచేసే డివైజ్లకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని, తమ మొబైల్ డివైజ్ను మించినది మరొకటి ఉండకూడదని ఆయన చెప్పారు. జూలై 21న మైక్రోసాఫ్ట్ నివేదించిన రిపోర్టులో విండోస్ సర్ఫేస్ రెవెన్యూలు 2 శాతానికి పడిపోయినట్టు తెలిసింది. ఫోన్ రెవెన్యూలైతే ఏకంగా జీరోకు దిగజారాయి. అయినప్పటికీ, కొత్త మొబైల్ డివైజ్ రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తూనే ఉంది. క్లౌడ్ ఆధారిత కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేస్తుందని కంపెనీ తెలిపింది. వైర్లెస్ కమ్యూనికేషన్స్ డివైజ్ టైటిల్లో మైక్రోసాఫ్ట్ దీని పేటెంట్లను సంపాదించిందని తెలిసింది.