బిగ్‌బాష్ విజేత పెర్త్ స్కార్చర్స్
ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌పై విజయం
కాన్బెర్రా: బిగ్‌బాష్ టి20 లీగ్ చాంపియన్‌షిప్ ఫైనల్...చివరి ఓవర్లో పెర్త్ విజయానికి 8 పరుగులు చేయాలి. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రెట్‌లీ బౌలింగ్ చేస్తున్నాడు. మొదటి మూడు బంతులకే 7 పరుగులు వచ్చాయి. మరో 3 బంతుల్లో ఒక పరుగు చాలు. ఈ దశలో లీ వరుసగా రెండు బంతులకు రెండు వికెట్లు తీసి ఉత్కంఠ రేపాడు. అయితే చివరి బంతి ఆడిన యాసిర్ అరాఫత్ మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ వైపు విసిరాడు.
అక్కడే ఉన్న సిడ్నీ కెప్టెన్ హెన్రిక్స్ దానికి సరిగా అందుకోలేక సునాయాస రనౌట్‌ను వృథా చేశాడు. ఫలితంగా స్కార్చర్స్‌కు టైటిల్ దక్కింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ 4 వికెట్ల తేడాతో సిడ్నీ సిక్సర్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం పెర్త్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసి నెగ్గింది. ఈ మ్యాచ్‌తో పేసర్ బ్రెట్‌లీ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అయ్యాడు.