రోడ్డెక్కిన జాలర్లు
సాక్షి, చెన్నై : ఎన్నికల వాగ్దానం మేరకు సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, కుటుంబ కార్డుదారులకు ఉచిత గ్రైండర్, మిక్సీ, టేబుల్ ఫ్యాన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో దశల వారీగా వీటి పంపిణీ జరుగుతోంది. ఐదేళ్లలోపు లబ్ధిదారులందరికీ ఉచితాల్ని పంపిణీ చేయడానికి తొలుత నిర్ణయించారు. అయితే, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉచితాల పంపిణీ వేగవంతం చేశారు. రాష్ట్రంలోని లబ్ధిదారులందరి చెంతకు ఉచిత పథకాలను తీసుకెళ్లడమే లక్ష్యం గా అధికార యంత్రాంగం ఉరకలు తీస్తోంది.
ఈ ఉచితాలను త్వరితగతిన తీసుకోవాలన్న ఆత్రుత కుటుంబ కార్డు దారుల్లో పెరిగింది. ఇందు కోసం ప్రత్యేకంగా టోకెన్లు అందజేస్తున్నారు. ఈ టోకెన్ల కోసం ప్రత్యేక శిబిరాల్ని ఏర్పా టు చేస్తున్నారు. ఈ శిబిరాలకు వేలాది గా జనం తరలి వస్తుండడంతో గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న రెవెన్యూ సిబ్బంది కొందరు తమ పనితనాన్ని పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు. అలాగే, పార్టీలకు అతీతంగా ఉచితాల్ని కుటుంబ కార్డుదారులకు అందజేయూ ల్సి ఉండగా, కొన్ని చోట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు బయలు దేరుతున్నాయి. అదే సమయంలో రోజుకో చోట ఆందోళనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. టోకెన్ల పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండి పడుతున్నారు.
ఆగ్రహం : నగరంలోని నొచ్చికుప్పం జాలర్లలో శనివారం ఆక్రోశం రగిలింది. అధికారుల తీరును ఎండగడుతూ రోడ్డెక్కడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మైలాపూర్‌లో నొచ్చికుప్పం పరిసర వాసులకు ఉచిత పథకాల పంపిణీ జరుగుతోంది. నాలుగు రోజులుగా నొచ్చికుప్పం జాలర్లు ఉచితాల కోసం వచ్చి ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వస్తున్నది. రోజంతా గంటల తరబడి క్యూలో ఉండటం, చివరకు టోకెన్లు రాలేదంటూ తిప్పి పంపడం జరుగుతూ వచ్చింది. శనివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జాలర్ల కుటుంబాలు మైలాపూర్‌లోని ఓ స్కూల్ ఆవరణలో బారు లు తీరాయి. గంటల తరబడి క్యూలో నిలుచున్నా, తమ వాళ్లెవరి పేర్లను పిలవక పోవడంతో ఆగ్రహం రగిలింది.
ఆందోళన: తమకు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటూ అధికారుల్ని జాలర్లు కుటుంబాలు నిలదీశాయి. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం తో ఆగ్రహించిన ఆ కుటుంబాలు కామరాజర్ సాలై - మెరీనా బీచ్ రోడ్డులో బైఠాయించాయి. దీంతో ఆ మార్గంలో ఉదయాన్నే ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. అధికారులు బుజ్జగించినా, పోలీసులు హెచ్చరించినా జాలర్లు మాత్రం తగ్గలేదు. చివరకు ఆ మార్గం నుంచి మరో మార్గం గుండా వాహనాలను దారి మళ్లించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా బలగాల్ని మొహరింప చేశారు. ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని నొచ్చికుప్పం జాలర్లను బుజ్జగించారు. అందరికీ మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లను అందజేస్తామని, టోకెన్లు సాయంత్రంలోపు ఇచ్చి, ఉదయాన్నే అందరికీ ఉచితాల్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జాలర్లు శాంతించారు.