తమిళ సింగర్ అరెస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అవమానిస్తూ పాట రాశారనే ఆరోపణతో జానపద గాయకుడు ఎస్ శివదాస్ అలియాస్ కొవన్(45)ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చి సమీపంలోని మారుతంద కురిచిలో శుక్రవారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను మద్రాస్ కు తరలించారు.
విప్లవ సంస్థ 'మక్కల్ కళై ఇలక్కియ కజగమ్'తో ఆయనకు సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. జయలలితకు వ్యతిరేకంగా పాట రాసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాపులకు మూసివేయాలని రాసిన పాటలో 'అమ్మ'ను అవమానించే పదాలున్నాయన్న ఆరోపణలతో శివదాస్ ను అరెస్ట్ చేశారు. ఈ వీడియో పాటను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.
రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద శివదాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శివదాస్ ను కలిసేందుకు పోలీసులు అనుమతించలేదని లాయర్ జిమ్ రాజ్ మిల్టన్ తెలిపారు. దీనిపై మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.