సమగ్ర సాగుతో 50% అధికాదాయం!
* సమగ్ర సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్న తమిళనాడు వ్యవసాయ వర్సిటీ.. మాగాణి, మెట్టలోనూ అమలు
* నేలకు సారం.. రైతుల కుటుంబాలకు పోషకాహారం
తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం. ఇప్పుడు నాలుగెదైకరాలున్న సన్నకారు రైతుల నుంచి.. పదుల ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, పల్లెలు గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్లు ఒక వైపు వ్యాపారుల హస్తలాఘవం రుచి చూస్తే.. మరో వైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు.
మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పడుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఎక్కి ఏలుతున్న ఆధునికత ధాటికి సాగు నిట్టాడి విరిగి నిలువునా కూలిన ఇల్లయింది. వ్యవసాయం ప్రధాన, అనుబంధ రంగాల మేలుకలయికగా కలిసి నడిచిననాడు కూడుకు, గుడ్డకు లోటన్నది కానరాలేదని రైతాంగం కరాఖండిగా ప్రకటిస్తున్నారు. మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలు పెట్టిన నాటి నుంచే రైతుల నిట్టాడికి చెదపట్టడం మొదలయిందని మూలాలను తోడుతున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి విరుగుడుగా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సమగ్ర సేంద్రియ వ్యవసాయ విధానానికి రూపకల్పన చేసి అమలుపరుస్తున్నారు.
తమిళనాడులోని అన్ని వ్యవసాయక జీవావరణ ప్రాంతాల్లోనూ సమగ్ర వ్యవసాయ విధానం అమలు జరుగుతోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అధీనంలో ఉన్న క్షేత్రాల్లో తొలుత కొందరు రైతులకు శిక్షణ అందించి, ఈ నమూనాకు విసృ్తత ప్రచారం కల్పించారు. నీటి వసతి కలిగిన క్షేత్రాలు, వర్షాధారిత ప్రాంతాలు, కోస్తా ప్రాంతాలంతటా ఈ విధానం అమలు జరిపి, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. దీని కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రానమీ డెరైక్టరేట్ ఆఫ్ క్రాప్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఒక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఒక హెక్టార్(రెండున్నర ఎకరాల) పొలాన్ని సమగ్ర వ్యవసాయ క్షేత్రం యూనిట్‌గా నిర్ణయించారు. 2013 ఖరీఫ్‌లో కావేరి డెల్టా ప్రాంతంలో వరి పంటతో పాటు చేపల పెంపకం, కోళ్ల పెంపకం చేపట్టారు. పది సెంట్ల స్థలంలో చెరువు నిర్మించి, ఇందులో నాలుగు రకాల మంచినీటి చేపలు ఒక్కొక్క రకం నాలుగు వందల పిల్లలను వదిలారు. చెరువు గట్టు వెంట 50 అరటి మొక్కలు పెంచారు. చెరువు గట్టు చుట్టూరా పెట్టిన దడికి (కంచె)కు కాకర పాదులు వేశారు.
అదే చెరువులో గూడు మంచెను ఏర్పాటు చేసి అందులో 50 కోళ్లను పెంచారు. 12/4/2 అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్టు యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో పెంచిన చేపలు కిలో రూ. 50 చొప్పున అమ్మగా, వాటిపై రూ. 40 వేల ఆదాయం వచ్చింది. 50 అరటి చెట్ల దిగుబడిపై రూ. పది వేలు ఆదాయం వచ్చింది. వీటితోపాటు కాకర పాదుల నుంచి కనిష్టంగా టన్ను దిగుబడి రాగా కిలో రూ. పది చొప్పున మొత్తం రూ. పది వేలు, కోళ్లు అమ్మగా రూ. 15 వేల ఆదాయం వచ్చింది. దీనికి అదనంగా మాగాణి వరి సాగులో పండిన ధాన్యం 5,200 కిలోలు అమ్మగా రూ. 62,400 సమకూరింది.
అదే మాదిరిగా పశ్చిమ మండల ప్రాంతంలో.. రెండున్నర ఎకరాల పొలంలో 90 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. మిగతా స్థలంలో రెండు పాడి ఆవులు, 30 దేశీ కోళ్లు పెంచారు. వర్మీ కంపోస్టు తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
వర్షాధారిత ప్రాంతంలో.. 90 శాతం స్థలంలో మెట్ట పంటలు, పశుగ్రాసం సాగు చేయించారు. ఈ యూనిట్లో 10+1 గొర్రెలు/ మేకలను, 30 దేశీ కోళ్లను పెంచారు. 12/4/2 అడుగుల వైశాల్యం గల వర్మీ కంపోస్టు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మూడు ప్రాంతాల్లో అనుసరించిన సమగ్ర వ్యవసాయ విధాన నమూనాలలో సగటున రైతు ఆదాయం సాధారణం కంటే 50 శాతం పెరిగినట్లు గుర్తించారు. కావేరీ డెల్టా ప్రాంతంలో రైతుకు రూ. 85 వేల నికరాదాయం, దక్షిణ మండలంలోని వర్షాధార ప్రాంతంలో రూ. 65 వేల నికరాదాయం రైతుకు లభించింది. రైతు కుటుంబం ఉత్పాదక పని దినాలు 40 శాతం పెరిగాయి.
దీంతోపాటు మనుషులకు, పశువులకు పౌష్టికాహారం అందుబాటులోకి వచ్చింది. పశువుల పేడ, మూత్రం, గడ్డీ గాదం పునర్వినియోగం వలన భూసారం పెరిగింది. నికరాదాయ వనరు సమకూరడం వలన వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆచరణలో లాభసాటి అని నిరూపితమైన ఈ విధానాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ పద్ధతిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
- జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్