స్వగ్రామంలో ‘వైకుంఠసేవ’
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సొంతూరు మనకేం చేసింది అని కాదు.. ఊరికి మనమేం చేశామన్నదే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి..’ అని తండ్రి చెప్పిన మాటల్ని ఆయన మరిచిపోలేదు. చదువు, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లినా ప్రశాంతతకు ఆలవాలమైన తన స్వగ్రామాన్ని మర్చిపోలేదు. అందుకే మనిషిని విజయపథం వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గానికి బాటలు వేశారు. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించి వైకుంఠవాసుడి దర్శనాన్ని ఊరి ప్రజలకందించారు. మరెన్నో సేవాకార్యక్రమాలతో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నారు.
ఆయనే తమ్మిడిశెట్టి బసవరాజు. చార్మినార్ డివిజన్ సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి. ఆయన స్వగ్రామం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం. తల్లిదండ్రులు భూదేవి, వీరభద్రరరావు. పదో తరగతి వరకు పాయకరావుపేటలోనే విద్యనభ్యసించిన ఆయన ఇంటర్ నుంచి సొంతూరైన మంగవరానికి దూరమయ్యారు. ఇంటర్, డిగ్రీ కాకినాడలో, ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
గుడి కట్టించారు..: మంగవరం గ్రామ ప్రజలు దైవ దర్శనం చేసుకోవాలంటే 20 కిలోమీటర్ల పైబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీని కోసం తన స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఇబ్బందుల్ని గమనించారు బసవరాజు. తన ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 500 గజాల విస్తీర్ణంలో దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించి ‘పద్మావతీ, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయాన్ని’ గత ఏడాది మేలో పూర్తి చేశారు. ఆలయంలో విగ్రహాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందించింది.
అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో గోదాదేవి కల్యాణ మహోత్సవం తరువాత మొదటగా ఊరిలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారికి తాళిబొట్టుతో పాటు ఇతర సరంజామాను ఉచితంగా ఆలయం తరుఫున అందజేయాలని నిర్ణయించారు. గోదాదేవి కల్యాణం రోజున వందలాది మందికి అన్నదానం చేస్తున్నారు. గుడి ఆదాయాన్ని బట్టి పేదవారికి సహాయ సహకారాలు అందించేందుకు వివిధ సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
భవిష్యత్తులో గ్రామంలో మంచినీటి ప్లాంట్ల నిర్మాణం, ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ (పశువుల) ఆస్పత్రి నిర్మించే యోచనలో ఉన్నట్లు బసవరాజు తెలిపారు. ‘మా గ్రామానికి చెందిన చాలా మంది హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. వారందరూ ఊరిబాగు కోసం సహకారం అందించాలి. గ్రామాన్ని మరింతగా అభివద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నా మనవి’ అని అంటున్నారు బసవరాజు.
పేరు: తమ్మిడిశెట్టి బసవరాజు
ఉద్యోగం: సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి(చార్మినార్ డివిజన్)
సొంతూరు: మంగవరం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా