రంగనాయకపురంలో ఇజ్రాయిల్ బృందం
రంగనాయకపురం (తాళ్లరేవు), న్యూస్‌లైన్ :
ఇజ్రాయిల్ వాలంటీర్ల బృందం తాళ్లరేవు పాఠశాలలో పాఠాలు బోధిస్తోంది. విద్యా ర్థులతో కలసిపోయి వారి మంచి విషయాలను మనసుకు హత్తుకునేలా చెబుతోంది. మన దేశంలో విద్యా విధానంపై పరిశోధనకు, సామాజిక సేవ చేయాలని మంజుల, ఒమెర్ నేతృత్వంలోని 11మంది సభ్యుల బృందం తాళ్లరేవు వచ్చింది. నిమ్మీ, బెచ్‌షేవా, రోమీ, ఇలీల్, మాయా, షరోన్, ఆఫర్, అలీల్, సాంద్రా, ఇలానా, గాల్ ఆ బృందంలో ఉన్నారు. స్థానిక రంగనాయకపురంలోని రంగా విద్యాలయలోనే ఉండి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థులకు బోధించే అంశాల్లో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల హెచ్ఎమ్ కేవీవీ రామకృష్ణ, పిఆర్ఓ కె.ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు.
సేవ చేయడం ద్వారానే...
చిన్నతనం నుంచే సేవాభావం అలవర్చాలని ఇజ్రాయిల్ బృందం కో ఆర్డినేటర్ ఒమెర్ అన్నారు. ఇక్కడ పిల్లలు పాఠశాల గదులకే పరిమితం అవుతున్నారని, తమ దేశంలో ఏడాదిలో నాలుగు సార్లు అటవీ ప్రాంతంలో ప్రకృతి గురించి పరిశోధనలు చేస్తారని తెలిపారు. ఇక్కడ బట్టీ విధానం కొనసాగిస్తున్నారని, తమ దేశంలో చర్చల ద్వారా సబ్జెక్ట్‌పై అవగాహన కలిగిస్తారని చెప్పారు. పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థి రాణించిన సబ్జెక్ట్‌లో ప్రోత్సాహం అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతారని ఒమెర్ పేర్కొన్నారు.
టీచింగ్ మెథడాలజీపై శిక్షణ
ఇజ్రాయిల్ దేశస్థులు ముఖ్యంగా విద్య, వ్యవసాయ రంగాలపై దృష్టిసారిస్తారని మరో కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. ఏటా నెల రోజులు సామాజిక సేవ చేయడానికి ముందుకొ స్తారని చెప్పారు. మంతెన భువనేశ్వరి సూచన మేరకు రంగా విద్యాలయంలో వారం పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఇండియాలో 10 బిటిజిగాక్ ఆర్గనైజేషన్ పేరిట సేవలు అందిస్తున్నామని తెలిపారు.