పాలిటెక్నిక్ విద్యార్థుల అయోమయం
- ఇంగ్లిష్ పరీక్షలో గందరగోళం
- సాంకేతిక విద్యామండలి నిర్వాకం
వరంగల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అధికారుల తప్పిదాలతో విద్యార్థులు గంటపాటు ఆందోళన పడ్డారు. సర్దుబాటు చర్యలు చేపట్టడంతో విద్యార్థులు ఊపీరి పీల్చుకున్నారు.
గత నెల 15 నుంచి పాలిటెక్నిక్‌లోని వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ ఇంగ్లిష్ చివరి పరీక్ష యథావిధిగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. అరుుతే విద్యార్థులకు మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష పత్రాన్ని పంపిణీ చేశారు.
ఆందోళనకు గురైన విద్యార్థులు ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లగా.. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు ఆన్లైన్లో రెండో సంవత్సరం పరీక్ష పత్రాన్ని అందజేసి.. దాన్ని జిరాక్స్‌లు తీసి విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గంటపాటు ఆలస్యమైంది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది, వరంగల్ జిల్లా కేంద్రంలో 500 మంది విద్యార్థులు హైరానా పడ్డారు. సమాచార లోపం, తప్పడు ప్రశ్న పత్రంతో గంటపాటు పరీక్ష ఆలస్యమైన విషయం వాస్తవమేనని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రపాణి వివరించారు. ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని మరో గంటపాటు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.