శ్రీకూర్మంలో అపచారం!
శ్రీకూర్మం(గార):దేవుని ప్రసాదమంటే భక్తులు ఎంతో ప్రవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటిది దేవునితో ఆరగింపజేసే భోగానికి మరింత విశిష్టస్థానముంది. దేవునికి నైవేద్యం ఆరగింపు తర్వాత భక్తులకు ఈ ప్రసాదాన్ని అర్చకులు అందజేస్తారు. ఈ ప్రసాదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం దాటి వెలుపలకు వెళ్లకూడదని నియమం ఉంది. అయితే ఈ నియమాలన్నింటికీ విరుద్ధంగా ఉంది శ్రీకూర్మనాథాలయ పరిస్థితి. శనివారం మధ్యాహ్నం స్వామి వారికి వండిన భోగాన్ని పక్కనున్న అపరకర్మల రేవు వద్దకు స్వయంగా వంట స్వామి తీసుకెళ్లి ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక రోజు ఆల స్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రాభోదిక బాల భోగం, రాజభోగం, సాయంఆరాధన స్వామికి నిత్యం ఆరంగింపులు ఉంటాయి. దీని కోసం ప్రత్యేకంగా దేవాలయం నిధులు కేటాయిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగా నిర్వహించేందుకు ఈ వేళల్లో దేవాలయ గర్భగుడి ద్వారాలను మూసేస్తారు. శనివారం స్వయంగా వంట స్వామి రాజభోగాన్ని పక్కనే అపరకర్మల్లో పాల్గొన్న వ్యక్తుల వద్దకు దేవుని ప్రసాదం వండే వంటపాత్రలతోనే భోగాన్ని తీసుకువె ళ్లగా భక్తులు ఇదేమిటని నిలదీసినట్టు తెలిసింది.
ప్రసాదం దేవాలయం సరుకులేనా..?
శనివారం పితృకర్మల చేసే వారి కోసం చేసిన ప్రసాదం, వాటికి వాడే సామాన్లు దేవాలయానికి చెందినవా? లేదా పితృకర్మల కోసం వచ్చిన వారే సామన్లు అందించి ఇక్కడ వండిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పవిత్రమైన భోగ ప్రసాదాన్ని వండే వంటపాత్రలతో అపకర్మల వద్దకు ప్రసాదాన్ని తీసుకువెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రసాద నాణ్యతపై కూడా గతంలో విశాఖ, విజయనగరం, అనకాపల్లికి చెందిన భక్తులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆలయ ఈవో వి.శ్యామలాదేవికి జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా అదనపు బాధ్యతలు ఉండడంతో దేవాలయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆలయంపై తూతూమంత్రంగా పర్యవేక్షణ ఉండడంతో ప్రసాదాలు పక్కదోవ పడుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కార్యాలయ సూపరింటెండెంట్ నర్సుబాబు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా భోగం బయటకు వెళ్లిన సంగతి మా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామన్నారు.