‘టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యూయేషన్’ సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విజయవాడ: పదవ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఎండల తీవత్రను దృష్టిలో పెట్టుకుని మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా సీఎం జగన్ ఆదేశాలతో మూల్యాంకన కేంద్రాల్లోని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా పరిశీలించారు.
10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా తీశారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ఏప్రిల్ 26 వరకు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలను సందర్శించాలని తనతో పాటు ఇతర సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా స్పాట్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాల పని తీరును ఆయన పరిశీలించారు.
ముందుగా గుంటూరు జిల్లా నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్, పల్నాడు జిల్లాలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ను సందర్శించి, మూల్యాంకనం లో పాల్గొన్న ఉపాధ్యాయులందరితో సంభాషించారు. ప్రభుత్వం వారికి అందించిన అన్ని సౌకర్యాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. బల్లలు, కుర్చీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి వసతి, టాయిలెట్ల నిర్వహణ తదితరాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు అదే సమయంలో ఇతర జిల్లాల్లోని కేంద్రాలను కూడా సందర్శించాలని ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ అధికారులను కోరారు.
కొన్ని మూల్యాంకన కేంద్రాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని,ప్రస్తుత అవసరాలకు వాటిని మరింత మెరుగు పరిచాల్సి ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కోసం కొత్త పాలసీని రూపొందించేందుకు విశాఖపట్నం, విజయనగరం కేంద్రాలను సందర్శించి తగు ఇన్పుట్స్ తీసుకుంటామని, వీలైనంత త్వరగా కొత్త విధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపినట్లు ప్రవీణ్ ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు.