నేటి నుంచి టెన్త్ స్పాట్
ఏర్పాట్లు పూర్తి
జిల్లాకు చేరిన 5.50 లక్షల జవాబుపత్రాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతపురంలోని కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయుల రాకపోకలను పర్యవేక్షించేందుకు సీసీ కెమరాలు అమర్చారు. జిల్లాకు 5.50 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. వీటిని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. 18 మందిని అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ల(వాల్యూయేషన్)ను నియమించారు. మూల్యాంకనానికి 1,200 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్ల(ఏఈ)ను నియమించారు. 250 మంది చీఫ్ ఎగ్జామినర్లు (సీఈ), 320 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. డీఈఓ లక్ష్మీనారాయణ క్యాంపు ఆఫీసర్గా , డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్)గా అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్రావు, మరో డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (స్ట్రాంగ్ రూం)గా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ వ్యవహరిస్తారు.
ఉదయాన్నే స్పాట్ కేంద్రానికి చేరుకోవాలి
మూల్యాంకనానికి ఉత్తర్వులు పొందిన ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉద యం 8 గంటలకే కేఎస్ఆర్ ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాలకు చేరుకోవాలని డీఈఓ తెలిపారు. ఉదయం 20 పేపర్లు, మధ్యాహ్నం 20 పేపర్లు ఇస్తామన్నారు. డ్యూటీకి నియమించిన వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. క్యాంపులో ఎవరూ సెల్ఫోన్లు వినియోగించరాదన్నారు. ఏ సబ్జెక్ట్ వారు అదే సబ్జెక్ట్ వద్ద ఉండాలి తప్ప ఇతర సబ్జెక్ట్ క్యాంపుల వద్దకు వెళ్లకూడదన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు జతచేస్తే వారిని విధుల నుంచి మినహాయిస్తామన్నారు.