సూర్యభగవానుడి పెంకుటిల్లు
ఫొటో చూడగానే... ‘వావ్ ఏముందీ ఇందులో’ అనిపిస్తుంది కదా! నిజమేగానీ... దీని అందచందాల గురించి కాసేపు పక్కనపెట్టి పైకప్పు పెంకుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. అంతా మామూలుగానైతే లేదు. ఎందుకంటే ఆ పెంకులు... సోలార్‌ప్యానెల్స్ కూడా. ఇంటికి కావాల్సిన విద్యుత్తు మొత్తాన్ని అక్కడే ఉత్పత్తి చేసి అందిస్తాయి ఈ పెంకులు. ఇలాంటివి ఇప్పటికే చాలా వచ్చాయి కదా.. కొత్తేమిటి? అంటే రెండో ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఈయన పేరు ఎలన్ మస్క్! స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈవో. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు రాకెట్లు తయారు చేయడమే కాకుండా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేస్తున్న టెకీ! ఒక్కమాటలో చెప్పాలంటే... హాలీవుడ్ సినిమా హీరో ఐరన్ మ్యాన్ వాస్తవ అవతారమీయన.
ప్రపంచాన్ని పర్యావరణ కాలుష్యం బారినుంచి కాపాడేందుకు ఈయన తనదైన సై్టల్లో పనిచేస్తూంటాడు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించినా, గిగావాట్లకు గిగావాట్ల సౌర విద్యుత్తును బ్యాటరీల్లోకి నింపగలిగినా, ఇంకో ఇరవై ఏళ్లలో మనిషిని అంగారకుడిపైకి పంపేస్తానని ధీమా వ్యక్తం చేసినా మస్క్‌కే చెల్లింది. ఇలాంటి టెక్ మేధావి తాజా ఆవిష్కరణ ఈ సోలార్‌ప్యానెల్ టైల్స్! సాధారణ టైల్స్‌కు రెట్టింపు దృఢంగా ఉండే ఈ ప్యానెల్స్ పూర్తిగా గాజులాంటి పదార్థంతో తయారవుతాయి. లోపలిభాగంలో సోలార్ సెల్స్‌తో కూడిన ప్యానెల్, ఒకదానితో ఇంకోదాన్ని అనుసంధానించేందుకు అవసరమైన వైరింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. టెర్రాకోట స్టైల్లోనే కాకుండా పూర్తి నలుపు రంగులో, లేదంటే తాండూరు బండల డిజైన్లోనూ ఈ టైల్స్‌ను అందుబాటులోకి తెచ్చాడు మస్క్. ఈ టైల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును టెస్లా కంపెనీ తయారు చేస్తున్న పవర్వాల్ – 2 బ్యాటరీలో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఒక్కో బ్యాటరీలో 15 కిలోవాట్/గంటల విద్యుత్తును స్టోర్ చేసుకోవచ్చు. ఏకకాలంలో 5 కిలోవాట్లు, అత్యవసర సమయాల్లో ఏడు కిలోవాట్ల విద్యుత్తును వాడుకోవచ్చు. అంతాబాగానే ఉందిగానీ... వీటి ఖరీదెక్కువేమో అన్న అనుమానమూ అక్కరలేదంటున్నాడు మస్క్. సాధారణ టైల్స్ కంటే తక్కువ ధరకు వీటిని త్వరలోనే అందిస్తానని ఇటీవలే ప్రకటించాడు!