కేసీఆర్పై హత్యాయత్నం కుట్రలు:టీఆర్ఎస్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్కు వెంటనే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని వారు కోరారు.
కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావటం.... ఆ తర్వాత రోజు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు.
మరోవైపు టీఆర్ఎస్ ను కాంగ్రెస్లో విలీనం చేస్తారనే వార్తలతో ఆపార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అధినేత తీసుకునే నిర్ణయంపై వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఉనికి పోకుండా ఉండేందుకే కేసీఆర్పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.