ఆ మూడు అడుగుల యువతి మహా సంకల్పం
కోల్‌కతా: ఆమె ఎత్తు మూడడుగులు. వయసు మాత్రం 19 ఏళ్లు. పుట్టుకతోనే అకాండ్రాప్లాసియా అనే జబ్బుతో బాధపడుతున్న ఆమెకు శరీర భాగాలు పెరగకుండా మందగించాయి. దీంతో ఆమె మూడు అడుగులకే పరిమితమై పోయింది. కాళ్లు, చేతులు, వేళ్లు అన్ని పెరుగుదల లోపించి ఉన్నాయి. ఫలితంగా ఆమె కూర్చోలేదు, నడవలేదు. దీంతో ఆమెను ఎక్కడికైనా తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సిందే.
పశ్చిమ బెంగాల్ లోని శాంతిపూర్‌కు చెందిన పియాశా మహల్దార్(19) అనే మూడు అడుగుల ఎత్తుకే పరిమితమైన యువతి అమర్తలా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతోంది. ఆమె చదువులో భాగంగా శాంతిపూర్ ఓరియెంటల్ అకాడమీలో పరీక్షలకు హాజరైంది.
ఆమెకోసం అధికారులు ప్రత్యేక గదిలో ఓ టేబుల్ ఏర్పాటుచేశారు. ఆ టేబుల్‌పై పడుకొని పరీక్షను రాసింది. గతంలో జరిగిన పరీక్షల్లో కూడా ఆమె అసాధారణ ప్రతిభ కనబరిచింది. శారీరకంగా కొంత బలహీనమైన పరిస్థితిలో కనిపించినా ఆ ఆలోచనను ఎప్పుడూ తన మనసులోకి రానివ్వకుండా గొప్ప స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో ఆమె దూసుకెళ్లిపోతుంది.