గణేశ్ ఉత్సవాలకు 100 ప్రత్యేక రైళ్లు
ముంబై : గణేశ్ ఉత్సవాల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 100కు పైగా రైళ్లు నడపాలని సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 118 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 36 రైళ్లు లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) నుంచి మడ్గావ్ వరకు నడవనున్నాయి. 01005 నంబర్ రైలు ఎల్టీటీ నుంచి అర్ధరాత్రి 12.55కు బయలుదేరి మడ్గావ్కు మధ్యాహ్నం 2.40కి చేరుకుంటుంది. ఈ సేవలు సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. అలాగే 01006 నంబర్ రైలు మడ్గావ్లో మధ్యాహ్నం 3.25కు బయలుదేరి ఉదయం 3.55కు ఎల్టీటీకి చేరుకుంటుంది.
ఈ సేవలు సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. గోవాలోని కర్మాలీ నుంచి ఎల్టీటీకి 42 స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు ఎల్టీటీ నుంచి 01025 అనే నంబర్ రైలు ఉదయం 5.30కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు కర్మాలీ చేరుకుంటుంది. 01026 నంబర్ రైలు కర్మాలీ స్టేషన్ నుంచి ఉదయం 5.50 కు బయలుదేరి సాయంత్రం 5.45కు ఎల్టీటీ చేరుకుంటుంది. అలాగే 40 డీఈఎంయూ రైళ్లను నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. టికెట్ బుకింగ్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం అవనున్నట్లు తెలిపింది.