ముస్తాబైన పెన్నహోబిళం
- రేపటి నుంచి శ్రీలక్ష్మీనారసింహుని బ్రహోత్సవాలు
- 14న కల్యాణోత్సవం, 16న బ్రహ్మరథోత్సవం, 19న ఉత్సవాల ముగింపు
ఉరవకొండ : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మీ నారసింహుడి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెన్నహోబిళం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. స్వస్తిశ్రీ హేవలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి ఈనెల 7వ తేదీ ఆదివారం శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆమిద్యాల నుంచి శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. 8న ధ్వజారోహణం, 9న సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు, 10న గోవాహనం, శేష వాహనంపై స్వామి దర్శనం, 11న హంస వాహనోత్సవం, 12న హనమంత వాహనోత్సవం, 13న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉంటాయి. 14న గరుడ వాహనోత్సవం అనంతరం శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 15న ఐరావత వాహనోత్సవం, 16న శ్రీవారి బ్రహ్మరథోత్సవం, 17న అశ్వవాహనోత్సవం, 18న ధ్వజావరోహణం, శయనోత్సవం ఉంటాయి. 19న ఉత్సవమూర్తులను ఆమిద్యాలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీంతో బ్రహోత్సవాలు ముగిస్తాయని ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారకానాథ్చార్యులు తెలిపారు.
ఆలయ సంక్షిప్త చరిత్ర
పెన్నహోబిళానికి క్షేత్ర పురాణం ఉన్నట్లు పూర్వీకుల కథనం. ఆ మేరకు పెన్నానదికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకు కింది భాగంలో తూర్పుదిశగా గొల్లపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామస్తునికి చెందిన ఒక గోవు ప్రతిరోజూ కొండపై ఉన్న బిలం మధ్యకు వచ్చి పాలిచ్చి వెళ్లేది. తన గోవు పొదుగు ప్రతిరోజూ ఖాళీగా ఉండటం గమనించి దాని యజమాని కలత చెందగా, ఆయనకు నారసింహుడు అగుపించి నీ గోవు పాలు తానే సేవిస్తున్నానని చెప్పారు. దీంతో బిలం ప్రాంతంలో పరిశీలించిన ఆవు యజమానికి బిలం పై భాగంలో 5.3 అడుగుల పరిమాణంలో ఉన్న స్వామివారి పాదముద్రిక ఉన్న శిలాఫలకం, కింది భాగంలో నైరుతి దిశలో లక్ష్మీదేవి శిల అగుపించాయి. దీంతో గొల్లపల్లి గ్రామస్తులు శ్రీవారి, అమ్మవారి ఆలయాలు నిర్మించి పూజలు ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయులు విజయనగరం నుంచి పెనుకొండకు వెళ్తూ ఈ క్షేత్రంలో మజిలీ గావించినట్లు కూడా ఆధారాలున్నాయి. ఈ కొండపై ఉద్దాలక మహర్షి తపస్సు కూడా చేసినట్లు చెబుతారు.
ప్రకృతి అందాలకు నిలయం
ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిళం పర్యాటక ప్రాంతంగా అందరి మనస్సులు దోచేస్తోంది. ఆలయం కింది భాగంలో గల గల పారే సేలయేళ్లు, ఎటు చూసినా పచ్చని చెట్లు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం పక్కన కోనేరులు, నెమళ్లు, జింకలు అప్పుడప్పుడూ పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. నిత్యం భక్తుల తాకిడి ఉండే పెన్నహోబిళానికి జిల్లా కేంద్రమైన అనంతపురానికి 35 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి పెన్నహోబిళానికి ప్రతి అరగంటకూ ఒక బస్సుంది.
అన్నీ ఏర్పాట్లూ చేశాం
బ్రహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశాం. ఎండలు మండిపోతున్న దృష్ట్యా ఆలయ ప్రాంగణం చుట్టూ చలువ పందిళ్లు వేయించాం. దీంతోపాటు భక్తులకు తాగునీరు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
- రమేష్‌బాబు, ఈఓ, పెన్నహోబిళం