ట్రైమెక్స్ నోట్లో ఇసుక
శ్రీకాకుళం: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తామని.. కొత్త పరిశ్రమలు పెట్టి.. నిరుద్యోగాన్ని రూపుమాపేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. రాజకీయ కారణాలతో ఉన్న పరిశ్రమలనే మూత వేయించేందుకు కుట్ర లు పన్నుతోంది. అందులోనూ 2004లో తాను అధికారంలో ఉన్నప్పుడే అన్ని అనుమతులిచ్చి ఏర్పాటు చేయించిన పరిశ్రమను మూసి వేయిం చే ప్రయత్నాలు చేయిస్తోంది. గార మండలం తోనంగి, వత్సవలసల్లో బీచ్ శాండ్ పరిశ్రమ ఏర్పాటుకు ట్రైమెక్స్ సంస్థకు 2004లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతులి చ్చారు. ఆ మేరకు రూ.400 కోట్లతో ట్రైమెక్స్ పరిశ్రమ ఏర్పాటై పని చేస్తోంది. 2010లో అప్పటి సీఎం కె.రోశయ్య దీన్ని ప్రారంభిం చారు. దీనిద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
మరోవైపు పరిశ్రమ యాజమాన్యం ప్రతి ఏటా కోట్లాది రూపాయలతో సీఎస్ఆర్ పథకం కింద తీరప్రాంత గ్రామా ల్లో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతోంది. రోడ్ల అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధి, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణకు లక్షలాది రూపాయలను శాశ్వత ప్రాతిపదికన ఖర్చు చేస్తోంది. ఓ స్కూల్, ఆస్పత్రిని కూడా నిర్వహిస్తోంది. ఇవి కాకుం డా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాల్లో, అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నా లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా సమాజానికి ఉపయోగపడుతున్న ట్రైమెక్స్ పరిశ్రమను మూ సి వేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేయడమో.. పరిశ్రమ కాలుష్యాన్ని వెదజల్లడమో దీనికి కారణం కాదు.
ఈ పరిశ్రమ యజమాని ఇటీవలి ఎన్నికల్లో వేరే పార్టీ తరఫున పోటీ చేశారన్న అక్కసుతోనే ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అం దులో భాగంగా పరిశ్రమకు అవసరమైన ముడిపదార్ధం రాకుండా కొందరు అడ్డుకుం టున్నారు. 2012లో టీడీపీ బడా నాయకులే యాజమాన్యానికి, స్థానికులకు మధ్య ఓ ఒప్పందం కుదిర్చి అక్కడ ఉన్న మహిళలకే మైనింగ్ హక్కు కల్పించారు. వారి ద్వారానే సంస్థ మైనింగ్ జరుపుకునేలా ఒప్పందాన్ని కుదిర్చారు. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు ఉండేలా కూడా నిర్ణయించారు.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడం ప్రారంభిం చారు. అలాగే పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ట్రైమెక్స్ సంస్థ కొన్ని భూములను కొనుగో లు చేసింది. అందులో కూడా మైనింగ్ చేయకుండా కొందరు అడ్డుకోవడమే కాకుండా ఆ భూములను పంచాలని డిమాండ్ చేస్తుండ డం విడ్డూరం. జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న పరిశ్రమను మూసివేయించాలని చూడటం తగదని, రెండు వేల కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.