డీఎడ్‌కు తగ్గిన డిమాండ్
వెబ్ ఆప్షన్లు ఇచ్చింది కేవలం 27 వేల మంది
ఈ నెల 26న సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుకు ఈసారి డిమాండ్ తగ్గింది. డీఈఈసెట్-2015 పరీక్షకు 1,05,382 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 68,884 మంది అర్హత సాధించారు. వెబ్ కౌన్సెలింగ్‌లో కేవలం 27 వేల మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలకు చేపట్టిన డీఈఈసెట్-2015 వెబ్ఆప్షన్ల గడువు సోమవారంతో ముగిసింది.
గతేడాది జూలైలో జరగాల్సిన ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 26న సీట్లు కేటాయించనున ్నట్లు డీఈఈసెట్ కన్వీనర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 10 ప్రభుత్వ డైట్, 183 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 8,700 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మరో 1,890 మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకోనున్నాయని వెల్లడించారు.