జిల్లాకు నూతన సబ్స్టేషన్లు
కడప అగ్రికల్చర్:
జిల్లాలో ట్రాన్స్‌కో సంస్థ నూతనంగా ఐదు ప్రాంతాల్లో సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర డైరక్టర్ ఆర్ నాగరాజస్వామి వెల్లడించారు. బు«ధవారం జిల్లా కేంద్రమైన కడపలోని శంకరాపురం వద్దనున్న ఫవర్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకుగాను కొత్తగా శాటిలైట్ సిటీ, బ్రహ్మంగారి మఠం, కలసపాడు, చిన్న ఓరంపాడు, వి కోటల్లో 400 కేవీ సబ్స్టేషన్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించి టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే లైన్‌లాస్ తగ్గించడానికి పాత సబ్స్టేషన్లలో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను తొలగించనున్నామని వివరించారు. కడప ఫవర్ హౌస్‌లో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను, కంట్రోల్ మిషన్లను, ప్యానెల్ బోర్డులను మార్చి వేసి నూతన సాంకేతిక ఆటోమేటిక్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ. 4.50 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలో మరో రెండు 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ పోరుమావిళ్లలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా లో ఓల్టేజీ లేకుండా చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 112 కోట్లు అందిస్తోందన్నారు. ఈ సబ్స్టేషన్లు పూర్తి కావాలంటే ఒకటిన్నర సంవత్సరం పడుతుందన్నారు. డైరక్టర్ వెంట ట్రాన్స్‌కో ఎస్ఈ వెంకటస్వామి, డీఈలు రాజగోపాల్‌రెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, ఏడీఇలు వీరభద్రయ్య, రవీంద్ర, అరుణ్‌కుమార్, శ్రీనాధుడు, వాసు, రామ్మోహన్, ఏఈఓలు కమలాకర్, మల్లిఖార్జున తదితరులు ఉన్నారు.