మహిళల త్రయంబక యాత్రకు బ్రేక్
భూమాతా బ్రిగేడ్‌ను అడ్డుకున్న పోలీసులు
స్వల్ప ఉద్రిక్తత
సాక్షి, ముంబై/ పుణే: వివిధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భూమాతా బ్రిగేడ్ ఈసారి మహాశివరాత్రి సందర్భంగా త్రయంబకేశ్వర్ ఆలయానికి తలపెట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయానికి 80 కి.మీ. దూరంలోని నందూర్శింగోటి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. కొంత ఉద్రిక్తత తర్వాత వారిని విడుదల చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, త్రయంబకేశ్వర్‌లో ఉన్న ప్రసిద్ధ శివాలయంలో పూజలు నిర్వహించడానికి ఈ బ్రిగేడ్‌కు నాయకత్వం వహిస్తున్న తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలో 150 మందికిపైగా మహిళలు సోమవారం ఉదయం పుణే నుంచి బయలుదేరారు.
దేశాయ్ కొంతమంది మహిళలతో కలసి జనవరి 26న శని శింగనాపూర్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోలా తమను అడ్డుకోవద్దని దేశాయ్ అధికారులను కోరారు. త్రయంబకేశ్వర్ గర్భాలయంలో పూజలు చేస్తామన్నారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో ఇప్పటికే త్రయంబకేశ్వర్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, భూమాతా బ్రిగేడ్ హెచ్చరికల నేపథ్యంలో శాంతికి విఘాతం కలగకుండా మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క వీరు గర్భగుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని మహిళా దక్షతా సమితి, శ్రద్ధా మహిళా మండల్, పురోహిత్ సంఘ్ తదితర సంస్థలు ప్రకటించాయి. మరోపక్క.. జూనా అఖాడాకు చెందిన సాధ్వి హరిసిద్ధ గిరి సోమవారం త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఆలయ అధికారులు, మహిళలు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు.