వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
ముదినేపల్లి : మండలంలోని బొమ్మినంపాడు పాత దళితవాడలో వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ కన్వీనర్ దాసి రంగారావుపై మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవగా, ప్రాణాపాయ స్థితిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 31న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేసిన నేతల రూపకు రంగారావు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో రూప గెలుపొందారు. ప్రత్యర్థి వర్గం నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక రంగారావుపై కక్ష పెంచుకున్నారు. తమ అభ్యర్థి ఓటమికి ఆయనే ప్రధాన కారకుడిగా భావించారు.
ఈ నేపథ్యంలో రంగారావు మంగళవారం పొలంలో పురుగుల మందు చల్లి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రత్యర్థి వర్గానికి చెందిన పంతగాని సతీష్‌బాబు గడ్డపలుగుతో దాడి చేశాడు. ఈ ఘటనలో రంగారావు తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగారావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె.ఈశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ సతీష్ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.
దాడి హేయం...
రంగారావుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తదూలం నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు తీవ్రంగా ఖండించారు. ముదినేపల్లిలో వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన హేయమైనదిగా అభివర్ణించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కక్షలు పెంచుకుని దాడులు చేయడం తగదని హితవు పలికారు. రంగారావుపై హత్యాయత్నాన్ని పార్టీకి చెందిన వివిధ విభాగాల కన్వీనర్లు తీవ్రంగా ఖండించారు.