టీఆర్ఎస్ హామీలే మనకు ఆయుధాలు
• టీపీసీసీ వ్యూహరచన
• ఇంటింటికీ తిరుగుదాం... వాస్తవాలేమిటో చెబుదాం
• డిసెంబర్ మొదటి వారంలో సోనియా లేదా రాహుల్ రాక
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అమలుకు నోచుకోని హామీలను ఆయుధాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. రైతులకు, విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలే ఆయుధాలుగా చేసుకుని పోరాడాలని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో వ్యూహరచన కమిటీ గురువారం సమావేశమైంది. ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియాతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
రుణమాఫీ చేయాలని రైతులతో, ఫీజు రీయింబర్స్‌మెంటు చేయాలని విద్యార్థులతో దరఖాస్తుల ఉద్యమాన్ని నవంబర్‌లో చేపట్టాలని తీర్మానించారు. ప్రతీ రైతును, విద్యార్థిని కలసి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు, చేసిన మోసం గురించి వివరించాలని నిర్ణయించారు. ‘ఫీజులను రీయింబర్స్‌మెంటు చేయకుండా ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను, వాటిల్లోని సిబ్బందిని ఎందుకు కష్టపెడుతున్నారు. వీటికి సంబంధించి కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను ఆయుధంగా చేసుకుంటాం’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడు వెల్లడించారు. రైతులు, విద్యార్థులు ఇచ్చిన దరఖాస్తులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేతుల మీదుగా రాష్ట్రపతికి అందజేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న రైతు ఉద్యమం, ప్రభావాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొప్పుల రాజు ఈ సమావేశంలో వివరించారు.
నియోజకవర్గాలవారీగా ఏఐసీసీ నిఘా
ఏఐసీసీ కనుసన్నల్లో జరుగుతున్న రైతు, విద్యార్థి ఉద్యమాల్లో క్షేత్రస్థాయిలో పనితీరుపై ఏఐసీసీ నిఘా వేసిందని నేతలు తెలిపారు. నియోజకవర్గాలవారీగా నాయకుల పనితీరు, లోపాలపై ఏఐసీసీ పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. పనితీరును బట్టి నాయకుల భవిష్యత్తు ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. రైతు, విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన ప్రచారంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
వినూత్నంగా ప్రచారం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై పలు అడ్వర్టైజింగ్ సంస్థల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. డిసెంబర్ మొదటివారంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలో ఒకరు రాష్ట్రానికి రానున్నారు. రైతు, విద్యార్థి ఉద్యమాలకు సంబంధించిన ఉమ్మడిసభను తెలంగాణలో నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. దీనికి సోనియా లేదా రాహుల్‌ను వస్తారని ముఖ్యనేతలు వెల్లడించారు. సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు మధుయాష్కీ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, డి.కె.అరుణ, సబితాఇంద్రారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.