పాక్ కొత్త పలుకు.. ట్రంప్తోపాటే మేం కూడా
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఉగ్రవాదం విషయంలో ప్రకటన చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము అమెరికాతో కలిసి సమాంతరంగా ముందుకు వెళతామని చెప్పింది. ఉగ్రవాదానికి కౌంటర్ ఇచ్చేందుకు తాజాగా అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ తో కలిసి పనిచేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలహా దారుడు సర్తాజ్ అజిజ్ అన్నారు. పాక్ లోని ఓ మీడియాతో సర్తాజ్ గురువారం మాట్లాడారు.
ఈ సందర్భంగా గతంలో ట్రంప్ పాక్‌ను నేరుగా విమర్శించారని, కొన్ని సంస్థలతో మాత్రమే పాక్ పోరాడుతూ మిగితా ఉగ్రవాద సంస్థలను పాక్ నిర్లక్ష్యం చేస్తుందని అన్నారని, అమెరికాలోని ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఉగ్రవాదంతో సంబంధం కలిపారు కదా అని ప్రశ్నించగా బదులిచ్చిన సర్తాజ్ అదంతా గతం అని, ఇప్పుడు అలాంటి విధానాలేవి లేవని, ఉగ్రవాద నిర్మూలనకోసం తీవ్రంగానే శ్రమిస్తున్నామని, తాము ట్రంప్‌తో కలిసి ఈ విషయంలో పోరాడుతామని చెప్పారు.