టఫ్ కార్యాలయాన్ని సీఎం తెరిపించాలి
మానవహక్కుల వేదిక
సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) కార్యాలయానికి పోలీసులు తాళం వేయడం చట్టవ్యతిరేక చర్య అని మానవ హక్కుల వేదిక పేర్కొంది. హోంమంత్రి ఆదేశాలు కూడా పోలీసులు ఖాతరు చేయలేదు కాబట్టి, సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కార్యాలయం తాళం తెరిపించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ కార్యాలయంపై జరిగిన పోలీసు దాడిపై ఎస్.జీవన్‌కుమార్, సయ్యద్ బిలాల్, ఇందిర, సంజయ్, నటరాజ్లతో కూడిన వేదిక బృందం నిజనిర్థారణ కమిటీగా ఏర్పడి ఈ కార్యాలయానికి తాళం వేసిన ఘటనపై విషయ సేకరణ చేసినట్టు తెలిపింది.
విమలక్క చెప్పిన ప్రకారం అధికారపక్ష నాయకులు అకారణ కక్షతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని భావించాల్సి వస్తుందని తెలిపింది. ఈ కార్యాలయం తనిఖీకి ఎలాంటి ఆదేశం, వారెంట్ లేకుండా పోలీసులు అక్రమంగా సెర్చ్ చేసి కొన్ని పుస్తకాలు, కరపత్రాలను, కళాకారులు ఉపయోగించే డప్పులను స్వాధీనం చేసుకున్నట్లు తమ కమిటీ పరిశీలనలో వెల్లడైందని జీవన్‌కుమార్, సయ్యద్ బిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అరుణోదయ, టఫ్ కార్యాలయాల విషయంలో కాలనీవాసుల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అని తాము చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో వాకబు చేయగా అటువంటిదేమి లేదని పోలీసులు తెలిపారన్నారు.