మీ సేవలు వద్దు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మీ-సేవ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ విధానాన్ని అప్పగించే యోచనను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరులు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు బైఠాయించి ఆందోళనలు జరిపారు. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. కోట్ల రూపాయల ఆస్తి లావాదేవీలకు ఆటంకం కలిగి కక్షిదారులు ఇక్కట్లపాలయ్యారు.
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, కంకిపాడు, నూజివీడుతోపాటు అన్ని సెంటర్లలో డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను బంద్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మూయించారు. గేట్లకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు. విజయవాడ నగరంలో గాంధీనగ ర్, పటమట, గుణదల, నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దస్తావేజు లేఖరుల సమ్మెకు మద్దతు తెలిపారు. పటమట కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం జిల్లా అధ్యక్షుడు తుమ్మల హరికృష్ణ, సంఘం నాయకుడు నారాయణరావు తదితరులు ఆందోళన జరిపారు.