ఆ సినిమాకు కట్లు తప్పవు
ముంబై: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్‌కు 89 కట్లు వేయడాన్ని సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహలానీ సమర్థించుకున్నారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. పంజాబ్ ఎన్నికలకు కూడా సంబంధంలేదని చెప్పారు.
తాను నియంతలా వ్యవహరిస్తున్నానంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నిహలానీ తోసిపుచ్చారు. సినిమా టైటిల్ నుంచి పంజాబ్ అన్న పదాన్ని తొలగించడంతో పాటు చిత్రంలో పంజాబ్, రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించి కట్లు వేయడం సెన్సార్ బోర్డు నిర్ణయమని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. టైటిల్ నుంచి పంజాబ్ అన్న పదాన్ని ఎందుకు తొలగించామన్నది ఈ సినిమా మొత్తం చూస్తే అర్థమవుతుందని వివరణ ఇచ్చారు. కాగా ఈ సినిమా విషయంలో కొన్ని రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వస్తుండగా, కొందరు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు.