కార్మికుల్ని విస్మరించిన సీఎం
* సమస్యలు, యూనియన్ రిజిస్ట్రేషన్లపై వివక్ష
* సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా
సిద్దిపేట అర్బన్: పది జిల్లాలోని ఉద్యోగులు, కార్మికుల పోరాటాలతోనే తెలంగాణ రాష్ట్రం ఆపై టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటు జరిగిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. ఆదివా రం ఆయన సిద్దిపేటలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, సహాయ కార్యదర్శి సులోచనలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపైన కేసీఆర్ నాయకత్వంపైన నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొన్నారని చెప్పారు.
కొత్త ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఉన్నారన్నారు. కానీ బడ్జెట్లో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం కార్మిక ఉద్యోగ సంక్షేమం కోసం నిధుల కేటాయింపు జరగకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ఎంప్లాయిమెంట్‌ను అమలు పరుస్తామని చెప్పి ఆ దిశగా కృషి చేయడం లేదని ఆరోపించారు. 25 ఏళ్లుగా వివిధ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ వ్యవస్థకు పాతరేసి రెగ్యులరేజ్ చేస్తానని చెప్పి ఇప్పుడు మిన్నకుండడం దారుణమన్నారు.
ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో లక్షల మంది పని చేస్తున్నారని వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవని చెప్పారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు దాటిందని ప్రభుత్వ పాలన సవ్యంగా జరగాలంటే 2 లక్షల ప్రభుత్వ ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కార్మిక సమస్యలను, యూనియన్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం వివక్షను చూపుతుందని మండిపడ్డారు.
రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లుగా కొనసాగుతున్న వాటి స్థానంలో తెలంగాణలో నూతన ట్రేడ్ యూనియన్ కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా భావించి ప్రభుత్వానికి దరఖాస్తులు చేస్తే వాటికి ఆమోదం తెలపకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వెంటనే ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్లకు గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంగన్వాడీ వర్క ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎ. మల్లేశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాలస్వామి, సీపీఎం డివిజన్ కార్యదర్శి రేవంత్‌కుమార్, సంయుక్త కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
ఉద్యమించాలి
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ విధానాలపై ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కోరారు. యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభల రెండు రోజుల ముగింపు సమావేశంలో ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సిబ్బందితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయని ధ్వజమెత్తారు. త్వరలో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు.