సీపీ చెబితే నేర్చుకునే పరిస్థితిలో మీడియా లేదు
ఏపీయూడబ్ల్యూజే
గాంధీనగర్ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు కమిషనర్ చెబితే నేర్చుకునే స్థితిలో మీడియా వారు లేరని, ఆయన చేసిన ప్రకటనలోని కథనమే నిజమని భావించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. కళ్యాణ్ కేసు విషయంలో ఎవరితోనైనా దర్యాప్తు చేయించేందుకు అభ్యం తరం లేదని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు జర్నలిస్టులకు సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, తపన, ఆలోచన లేదని చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. పౌరుల శాంతియుత జీవనంలో మీడియా పోషిస్తున్న ప్రధాన పాత్ర పోలీసు కమిషనర్‌కు తెలియదా? అని వారు ప్రశ్నిం చారు.
మీడియాలో వచ్చే కథనాల్లోని వాస్తవాలు జీర్ణించుకోవడం అందరికీ శ్రేయస్కరమని, అవి తప్పనే రీతిలో ప్రజలకు తప్పుడు సంకేతాలు మీద్వారా అందించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిం చారు. జరిగిన ఘటనలపై అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వార్తలు ప్రచురితం, ప్రసారం అవుతాయని సీపీలాంటి పెద్దలకు తెలియంది కాదని వారు హితవు పలికారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాను చులకన భావంతో చూడవద్దని కోరారు. జర్నలిస్టులను సమాజ ద్రోహులుగా చెప్పాలనుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని వారు సూచించారు. ప్రకటన జారీ చేసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, కృష్ణా అర్బన్ అధ్యక్షుడు జి.రామారావు, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ ఉన్నారు.