ఆలయంలో తొక్కిసలాట, నలుగురికి గాయాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ దేవాలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో నలుగురు భక్తులు గాయపడినట్టు శనివారం పోలీసులు పేర్కొన్నారు. గతరాత్రి ఉత్తరప్రదేశ్లోని వ్రిందావన్లో బిహారి దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ షాక్ అంటూ వదంతులు వ్యాపించాయి. దాంతో దేవాలయంలో ఉన్న భక్తులంతా తమకు ఎక్కడ షాక్ తగులుతుందోనని భయాందోళనకు గురయ్యారు. అయితే ఆలయంలో ఇరుకైన దారిగుండా వెళుతున్న ఓ మహిళ చేయి విద్యుత్ జంక్షన్ బాక్స్ వద్ద ఉన్న కరెంట్ తీగకు తగిలింది. దాంతో ఆమె తేలకపాటి షాక్కు గురైంది. ఆమె చేతిలో ఉన్న పసికందు చేతిలోనుంచి జారిపోయింది.
దాంతో భయపడిన భక్తులంతా పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసింది. దేవాలయ యాజమాన్యం అది కేవలం వదంతు మాత్రమే ఎలాంటి షాక్ లేదు అంటూ ప్రకటించిన కూడా భక్తులు నిలబడలేదు. కానీ, ఇదంతా సర్దుమనగడానికి దాదాపు గంటపాటు సమయం పట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.