పారిశుద్ధ్యం పాటించకుంటే జరిమానా
నగరవాసులకు పుణే కార్పొరేషన్ హెచ్చరిక
పింప్రి, న్యూస్‌లైన్: ఇక మీదట పరిశుభ్రత పాటించని నగర వాసులకు పుణే కార్పొరేషన్ జరిమానా విధించనుంది. ఈ మేరకు రూపొందించిన నియమావళిని సర్వసభ అనుమతి పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వానికి పంపనున్నారు. ఇకపై నగర వాసులు తమ ఇళ్లలోని ఫ్రిజ్, కూలర్లలో నీటిని తరచూ మారుస్తూ ఉండాలని, లేకుంటే దోమల వ్యాప్తికి కారణమవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కీటకాలను నియంత్రించే పనిలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కాక్పొరేషన్ కీటకనాశక విభాగ ప్రముఖుడు డాక్టర్ వైశాలీ జాదవ్ తెలిపారు.
కొన్నేళ్లుగా నగరంలో అధిక సంఖ్యలో దోమల గుడ్ల (డాస్) వ్యాప్తి జరుగుతోంది. దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం 1996 అక్టోబర్ మధ్య కాలంలో ఆదేశించింది. దీని అధారంగా గత ఏడాది పుణే కార్పోరేషన్ డాస్ ఉత్పత్తికి కారణమయ్యేవారిపై జరిమానాలను విధించాలనీ, అలాగే వారిపై చట్టపరంగా నేరాన్ని మోపి శిక్షించాలని నిర్ణయించారు. దీనిపై నగర ప్రజల అభిప్రాయాన్ని సూచనలను కోరారు. అయితే ప్రజల నుంచి ఏ విధమైన స్పందన రాలేదని కార్పోరేషన్ ఆరోగ్య విభాగం తెలిపింది.
తనిఖీలు ఇలా చేయనున్నారు..
అంటువ్యాధులతో డాక్టర్‌ను ఆశ్రయించే రోగుల వివరాలు సేకరించి వారి ఇంటి పరిసరాల్లోని ఇళ్లలో తనఖీలు చేయనున్నారు. ఫ్రిజ్‌లు, కూలర్లు, టెరస్లపై నీటి నిల్వ ఉండి డాస్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తిస్తే ఆ ఇంటి యజమానికి రూ.1,000 జరిమానా విధిస్తారు. మరుసటి రోజుకూ శుభ్రపరచకపోతే రోజుకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూనే ఉంటారు.