రెండో రోజూ ప్రచార హోరు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో రెండో రోజు కూడా కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తున్నారు. క్షేత్రస్థాయి జనబాహుళ్యానికి చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు.
‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం రెండోరోజు మంగళవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగింది. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లేసి మద్దతు పలకాలని నేతలు ప్రజల్ని కోరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన వస్తుందని వివరిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు.
కందుకూరులోని రెవెన్యూ కాలనీ, ప్రకాశం కాలనీలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గరటయ్య ప్రచారంలో భాగంగా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమపోస్టర్లు ఆవిష్కరించారు. పార్వతీపురంలో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. చీరాల రూరల్ మండలం ఈపురుపాలెంలో సమన్వయకర్త యడం బాలాజీ చేనేత కార్మికులను కలిశారు. కరపత్రాలు పంపిణీ చేసి, ప్రచారం నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం పామూరులో సమన్వయకర్త బుర్రా ముధుసూదన్‌యాదవ్ కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గం దేవనగరంలో సమన్వయకర్త ఐవీ రెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు నియోజకవర్గాల్లో కార్యక్రమం జరిగింది.