సహకార బ్యాంకులో భారీ చోరీ
- కార్యదర్శి హత్య
- రూ.3 కోట్ల నగలు, రూ.4 లక్షల నగదు చోరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులోని నాగపట్నం జిల్లా కీళ్ వెన్నిమనిలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకును దుండగులు దోచుకున్నారు. ఈ సంఘటనలో బ్యాంకు కార్యదర్శిని దారుణంగా హతమార్చి రూ.3 కోట్ల విలువైన నగలు, రూ.4 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ బ్యాంకు కార్యదర్శి కామరాజ్(56), క్యాషియర్ గణపతి(45) గురువారం రాత్రి 6.30 గంటల సమయంలో నగలు, నగదు లెక్కలు చూసుకోవడం మొదలు పెట్టారు.
బ్యాంకు ఎమర్జన్సీ అలారం రిపేరు చేయాలంటూ ఆరుగురు ఆగంతకులు బ్యాంకులో ప్రవేశించారు. ఇద్దరు అధికారులపై మత్తు మందు స్ప్రే చేసి, వారు స్పృహ కోల్పోయేలా చేశారు. స్పృహ లేని స్థితిలోనే కార్యదర్శి కామరాజ్‌ను నైలాన్ వైరు గొంతుకు బిగించి హతమార్చారు. అతని మృతదేహాన్ని లాకర్లోని ఒక కొక్కీకి నైలాన్ తాడుతో వేలాడదీశారు. అలాగే క్యాషియర్ గణపతిని సైతం తీవ్రంగా గాయపరిచి నోటిని ప్లాస్టిక్ టేపుతో బిగించి కుర్చీకి కట్టి పడేశారు. ఆ తరువాత బ్యాంకు లాకర్లోని రూ.3 కోట్ల విలువైన 11 కిలోల బంగారు నగలు, రూ.4 లక్షల నగదు దోచుకెళ్లారు.