దాడులు చేసినా దొరకరు!
* విజయవాడ క్లబ్‌పై పోలీసుల దాడులు
* ఎవరూ దొరక్కపోవడంతో వెనుదిరిగిన వైనం
* మూడుసార్లు దాడులు చేసిన ఇదే పరిస్థితి
*ఇంటి దొంగలే సమాచారం ఇస్తున్నారంటూ ఆరోపణలు
సాక్షి, గుంటూరు: నగరంలోని ఓ క్లబ్‌తోపాటు తాడేపల్లిలో ఉన్న విజయవాడ క్లబ్లో పేకాట ఆడుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లాకు నూతన ఎస్పీలు వచ్చిన ప్రతిసారీ హడావుడి చేయడంతో తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి ఎవరూ దొరకలేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆకస్మాత్తుగా దాడులు చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే క్లబ్‌ల నిర్వాహకులకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేయడం పరిపాటిగా మారింది. విజయవాడ క్లబ్‌పై ఇప్పటికీ మూడుసార్లు పోలీసులు దాడులు చేసినప్పటికీ ఇంతవరకు ఎవ్వరూ దొరక్కపోవడం గమనార్హం.
స్థానికులు మాత్రం ప్రతి రోజూ ఇక్కడ విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే బడా బాబులు పేకాట ఆడుతున్నారనే విషయం అందరికి తెలిసేందనని అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, క్లబ్‌ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మంగళగిరి శివారులో ఉన్న హ్యాపీ క్లబ్లో కూడా ఇదే తంతు జరిగేది.
ఇప్పట్లో ఎస్పీల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ముందుగానే క్లబ్ నిర్వాహకులకు సమాచారం అందించి ఎవరూ దొరకలేదంటూ రెండుసార్లు చేతులు దులుపుకున్న విషయం అందరికి తెలిసిందే. అప్పటి అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సొంత టీమ్‌ను పంపి మంగళగిరి శివారులో ఉన్న హ్యాపీ క్లబ్‌పై దాడులు నిర్వహించగా 350 మంది పేకాటరాయుళ్లు భారీ స్థాయిలో డబ్బుతో సహ పోలీసుల చేతికి చిక్కారు. ఆ తరువాత ఈ క్లబ్‌ను మూసివేశారు. జిల్లా స్థాయి అధికారులు తమ సొంత టీమ్‌లు, అవసరమైతే తామే స్వయంగా దాడులు నిర్వహిస్తే జిల్లాలో ఉన్న క్లబ్‌ల భాగోతం బయట పడుతుందని పలువురు చెబుతున్నారు.