సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్తో గ్రామాలు అభివృద్ది
మొదటి విడతలో రాష్ట్రంలో 358 సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ యూనిట్లు
పంచాయతీ రాజ్శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు
సామర్లకోట :
ఘన వ్యర్థాల నిర్వహణ గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం మండల పరిధిలో మేడపాడు గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతో ఇటువంటి యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా 368 మంజూరు చేశామని, ఇప్పటికి 50 శాతం పూర్తి అయ్యాయన్నారు. యూనిట్ పరిమాణాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు 62 యూనిట్లు మంజూరు కాగా 39 పూర్తయ్యాయన్నారు. చెత్త నుంచి ఎరువును తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందే విధంగా యూనిట్లు పని చేస్తున్నాయన్నారు. చెత్త నుంచి విద్యుత్తును కూడా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దశల వారీగా 13వేల పంచాయతీల్లోనూ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఉపాధి, 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవాలన్నారు. గతేడాని రాష్టంలో 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుత సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పంచాయతీ కార్యాలయ సొంత భవనాలకు రూ.5వేల కోట్లు విడుదల చేశామని, జిల్లాలో 125 పంచాయతీ భవనాలు నిర్మాణానికి రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటు, వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మలకల రంగనాయకులు, డీపీఓ శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సీసీ రోడ్డు ప్రారంభించారు.