పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం
ఔరంగాబాద్: నిందితులను వెతికి పట్టుకోవడానికి పోలీసులు ప్రదర్శించిన అతి తెలివి.. మరోసారి ఓ బాలిక అత్యాచారానికి గురైంది. మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన పోలీసుల ఉద్యోగానికి ముప్పు తెచ్చింది. సినీ లెవల్లో నిందితులకు ట్రాప్ వేసిన పోలీసులు చివరికి అభాసుపాలయ్యారు.
వివరాల్లోకి వెడితే ఈనెల 7వ తేదీన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి, తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు తన దగ్గరున్న మొబైల్‌తో ఈ దృశ్యాలను వీడియో తీసి, ఫోన్ ఎత్తుకుపోయారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇంతలో అత్యాచారం చేసిన వ్యక్తులు బాధితురాలు తల్లికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే, రూ.2000 ఇవ్వాలని , లేదంటే ఆ దృశ్యాలను ఇంటర్ నెట్లో పెడతామని బెదిరించారు. దీంతో నిందితులను ట్రాప్ చేసి ఎలాగైనా పట్టుకోవాలని ఎస్ఐ వినోద్ తదితర పోలీసులు పథకం వేశారు. బాధితురాలితో వాళ్ళకి ఫోన్ చేయించి.. ఓ ప్రదేశానికి రమ్మని చెప్పించారు. దానికి నిందితులు కూడా సరేనన్నారు.
అనుకున్నట్టుగానే ఆ అమ్మాయికి అక్కడికి బయలుదేరింది. కానీ మార్గమధ్యలోనే ఆమెను అటకాయించిన ఇద్దరు వ్యక్తులు మరోసారి ఆమెపై దారుణానికి తెగబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ అప్పటికే ఆ వీడియోను డిలిట్ చేశారు. దీంతో తెల్ల మొఖం వేయటం పోలీసుల వంతైంది.
అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారి విశ్వాస్ నాంగ్రే పాటిల్ ...ఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ నిమిత్తం ఓ పోలీస్ అధికారిని నియమించారు. అయితే నిందితుల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పోలీసులు వారికి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నవిషయాన్ని మాత్రం వెల్లడించారు.