వరంగల్ జట్ల విజయకేతనం
=ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ అండర్-19 పోటీలు
=బాలికల విభాగంలో ప్రథమ స్థానం
=బాలురలో రెండో స్థానం
వరంగల్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : రాష్ట్రస్థాయి అండర్-19 జూనియర్ కళాశాల కబడ్డీ పోటీల్లో వరంగల్ జట్లు హవా కొనసాగించాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానం నిలవగా, బాలుర విభాగంలో రెండో స్థానం సాధించింది. వరంగల్‌లోని రంగశాయిపేటలో మూడు రోజులుగా జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి.
ఈ పోటీల్లో బాలుర విభాగంలో ప్రకాశం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, వరంగల్ జట్టు రెండో స్థానం సాధించింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, విశాఖపట్నం ద్వితీయ బహుమతి అందుకుంది. బాలికల ఫైనల్ విభాగంలో వరంగల్ 49-18తేడాతో విశాఖపట్నంపై జయకేతనం ఎగురవేసింది. బాలుర ఫైనల్ విభాగంలో ప్రకాశం జట్టు 43-13 తేడాతో వరంగల్‌పై విజయం సాధించింది.
జాతీయస్థాయిలో రాణించాలి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డీవీఈఓ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సారయ్యతో పాటు, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఇవే చివరివని అన్నారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో వరంగల్ జిల్లా ముందుంటుందని, క్రీడల్లో కూడా ముందుంజలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ అండర్-19 జిల్లా సెక్రటరీ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ సారయ్య, నాయిని అశోక్, కేడల పద్మ, పోషాల పద్మ, ఎంబాడి రవీందర్, ఎం.వెంకటేశ్వరరావు, పెటా పీఈటీ సంఘం జిల్లా కార్యదర్శి కత్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.