తాలిబన్లకు చుక్కలు చూపించిన వసిల్ హత్య
కాబుల్ : పదేళ్ల వయసులోనే మిలిటరీ దళానికి నాయకత్వం, తుపాకీ చేతబట్టి తాలిబన్లకు చుక్కలు చూపించి, అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతోనే శభాష్ అనిపిచ్చుకున్న బుడతడు వసిల్ అహ్మద్. అయితే వసీల్ను ప్రయోజకుడిని చేయాలని భావించిన అతని కుటుంబ సభ్యులు మిలిటరీ నుంచి తీసుకువచ్చి పాఠశాలలో నాలుగో తరగతిలో చేర్పించారు. అయితే కొద్ది నెలల్లోనే తాలిబన్లు అదును చూసి కూరగాయలు కొనడానికి ఇంటి నుంచి బయటకు వచ్చిన వసిల్ను దారుణంగా హతమార్చారు. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు తాలిబన్లు గన్‌తో వసిల్ తలలోకి కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. ఓరుజ్గన్ ప్రావిన్స్‌లోని తిరిన్ కోట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వసిల్ మామ, ముల్లా అబ్దుల్ సమద్ తాలిబన్ ఉగ్రవాదుల దళాలకు కమాండర్‌గా ఉండేవాడు. అయితే తుపాకులను వదిలి తనతోపాటూ 36 మంది(వీరిలో వసిల్ తండ్రి ఒకరు) జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖాస్ ఓరుజ్గన్ జిల్లాలోని 70 మంది ఉండే అఫ్ఘాన్ స్థానిక పోలీస్ సేనల బాధ్యతను ప్రభుత్వం అతనికి అప్పగించింది. ప్రభుత్వం తరఫున సమద్ తాలిబన్లతో జరిపిన పోరాటంలో 18 మంది(వసిల్ తండ్రితో సహా) ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా తాలిబన్ల ప్రాబల్యం పెరగడంతో ఓరుజ్గన్లో భద్రత క్షీణిస్తూ వచ్చింది. రెండు నెలలపాటూ తాలిబన్లు చుట్టుముడుతూ రావడంతో సమద్ సేనలకు ఉచ్చు బిగుసుకున్నట్టయింది. తాలిబన్లతో జరిగిన పోరాటంలో సమద్తోపాటూ మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
సరిగ్గా అదే సమయంలో వసిల్(10) మిగిలిన సేనకు కమాండర్‌గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. 'అతను తాలిబన్లతో అద్భుతంగా పోరాడాడు. రాకెట్లను కూడా పేల్చాడు. 44 రోజులపాటూ నా సేనలను విజయవంతంగా ముందుండి, నేను కోలుకునే వరకు నడిపించాడు' అని సమద్ తెలిపాడు. నాటో దళాలు, అఫ్ఘాన్ దళాలు కలిసి తాలిబన్లను గత ఆగస్టులో దీటుగా ఎదుర్కొన్నాయి. దీంతో విజయంతో తిరిగి వచ్చిన సమద్‌తో పాటు అతని సేనలకు తిరిన్ కోట్ లో ఘనస్వాగతం లభించింది. డిప్యూటీ పోలీస్ చీఫ్ ఆఫ్ ఓరుజ్గాన్, రహిముల్లాఖాన్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు వసిల్ ఒదులుగా ఉన్న పోలీసు దుస్తులను ధరించి మెడ చుట్టు ప్లాస్టిక్ పూల దండలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు వసిల్ను తిరిన్ కోట్లో పాఠశాలలో చేర్పించారు. అయితే చదువులో అంతగా రాణించకపోవడంతో ఇంటి దగ్గరే ట్యూషన్లు పెట్టించి మరీ అతనికి చదువు నేర్పిస్తున్నారు. అయితే అతను ఎప్పుడూ మిలటరీ సంఘటనల గురించి ఎక్కువగా చర్చించేవాడని, ఆయుధాలు వాడటం, పోలీసు వాహనాలను నడపడం అలవాటుగా ఉండేదని వసిల్ బంధువులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు చిన్నతనంలోనే అతని ప్రతిభను గుర్తించి అవార్డులు, సత్కారాలు చేయడంతో చదువుపైన అంతగా శ్రద్ధ చూపేవాడు కాదని వసిల్ ఇంటి చుట్టు పక్కలవాళ్లు చెబుతున్నారు.
ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు, తాలిబన్ తిరుగుబాటుదారులకు మధ్య చిన్న పిల్లల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయో చెప్పడానికి వసిల్ కన్నీటి కథే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. 'చిన్న పిల్లలను మిలటరీలలో వాడకూడదన్న కఠినమైన నిబంధనలను అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రవేశపెట్టినా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘాన్ స్థానిక పోలీస్ దళాలలో ఎక్కువగా చిన్నపిల్లలను ఉపయోగిస్తునట్టు సమాచారం. దేశంలోని దక్షిణ ప్రాంతాలైన కుందుజ్, బదాక్షన్ ప్రాంతాలలో ఇది మీరీ ఎక్కువ.
తాలిబన్ ముట్టడి నుంచి బయటపడ్డ తర్వాత ప్రావెన్షియల్(రాష్ట్ర) ప్రభుత్వం ఆనందోత్సహాల్లో వసిల్ కు పోలీస్ దుస్తులు ధరించి మరీ పరేడ్ చేపించారు. అంతేకాకుండా మిలిటరీ జీవితాన్ని వదిలి వెళ్లిన ఆ పిల్లాన్ని తాలిబన్లను హత్య చేయడం దారుణం' అని ఆఫ్ఘాన్ మానవ హక్కుల కమిషన్ అధికార ప్రతినిధి రఫీవుల్లా బైదర్ అన్నారు. తాలిబన్లకు ఆ పిల్లవాడి నుంచి ఎలాంటి ముప్పులేదు. ఒక వేళ ఆ పిల్లవాడిని మిలటరీ క్యాంపులో చంపి ఉంటే అక్కడ పిల్లలకు ఏం పని అని తాలిబన్లు ప్రశ్నించే అవకాశం ఉండేది. కానీ, బాలుడి ఇంటి ముందే అతన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపడం దారుణం అని రఫీవుల్లా అన్నారు.