రైతుకు హెలెన్ తుపాను మిగిల్చిన వేదన
=వేసిన కూరతో సరిపెట్టుకోవాల్సిందే
=ప్రభుత్వ వసతిగృహాల్లో సక్రమంగా అమలుకాని మెనూ
=పట్టించుకోని వార్డెన్లు..అలమటిస్తున్న విద్యార్థులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మెనూ ప్రకారం ఆహార పదార్థాలు వండించాల్సిన వార్డెన్లు ఆ విషయాన్నే మరిచిపోయారు. కుక్ల ఇష్టారాజ్యానికి వదిలేసి తమ సొంత పనుల్లో బిజీగా గడుపుతున్నారు. పిల్లలకు ఏం వడ్డిస్తున్నారో.. ఏం తింటున్నారో పట్టించుకునే తీరిక వార్డెన్లకు లేకుండాపోయింది. దీంతో వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు పెట్టింది తిని కిమ్మనకుండా ఉండిపోతున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 151 వసతిగృహాలున్నాయి. వీటిలో 84 బాలురు, 67 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. 15,100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4,797 మంది చదువుకుంటున్నారు. ఇవి కాకుండా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టళ్లు నడుపుతున్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచకపోవడంతో ఉన్న నగదుతోనే విద్యార్థులకు భోజనం వండిపెడుతున్నామని వార్డెన్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నగదుకు, పెరిగిన ధరలకు పొంతనే లేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే సాధ్యమయ్యే పనికాదని చేతులెత్తేస్తున్నారు. సాధారణ ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 750, ప్రత్యేక వసతి గృహాల్లో రూ. 850 లను మెస్చార్జీలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది.
మచిలీపట్నం మండలం రుద్రవరం గురుకుల జూనియర్ కళాశాలలో 470 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం మెనూ ప్రకారం 200 గ్రాముల అన్నం, 100 గ్రాముల క్యాబేజీ, టమోట కలిపి కూర వండాలి. అయితే గోరుచిక్కుడుకాయలతో కూర వండారు. క్యారెట్, ములక్కాడలు, దోసకాయలతో తయారుచేశామని చెప్పిన సాంబారులో ఏ ముక్కలూ లేవు. పెరుగు వేయాల్సి ఉండగా పల్చటి మజ్జిగ పోస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 25 గ్రాములకు మించి కూరవేయడం లేదు. అన్నం పలుకుగా ఉంది. సాయంత్రం సమయంలో అరటిపండు ఇవ్వాల్సి ఉండగా ఉదయమే ఇచ్చేశామని అక్కడి వార్డెన్ చెప్పారు.
గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలోని బీసీ బాలికల వసతి గృహంలో అన్నం చిమిడిపోయింది. నాగవరప్పాడులోని 1, 11 వసతి గృహాల్లో మెనూ చార్టు పెట్టలేదు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు పండ్లు ఇవ్వాల్సి ఉండగా ‘న్యూస్‌లైన్’ వెళ్లడంతో హడావుడిగా తెచ్చి పంపిణీ చేశారు. నందివాడ ఎస్టీ బాలికల వసతి గృహంలో అన్నం జావకారిపోయింది. బీసీ బాలుర వసతి గృహంలో సాంబారు నీళ్లను తలపిస్తోంది. ఉడికీ ఉడకని బంగాళదుంప కూరను విద్యార్థులకు వడ్డించారు.
నూజివీడులోని సమీకృత హాస్టల్లో 252 మందికిగాను 180 మంది విద్యార్థులే ఉన్నారు. సాంబారు నీళ్లలా తయారు చేశారు. నూజివీడు బాలికల వసతి గృహంలో గుడ్డు వడ్డించలేదు. మైలవరం ఎస్సీ బాలుర వసతి గృహంలో వంకాయ, టమోట, కోడిగుడ్డు వండారు. అయితే ఈ కూరలు అంతగా బాగోలేదు. అన్నం సుద్దగా మారింది.
జి.కొండూరు బీసీ బాలుర వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయటం లేదు. ఎస్సీ బాలుర వసతి గృహంలో పాఠశాలలు ప్రారంభించిన నాటి నుంచి కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. ఉదయం పూట విద్యార్థులకు ఆరు ఇడ్లీలు చట్నీతో వడ్డించాల్సిఉండగా నాలుగు ఇడ్లీలు పంచదారతోనే సరిపెడుతున్నారు.
కలిదిండి మండలం కోరుకొల్లు ఎస్సీ బాలికల వసతి గృహంలో భోజనం చిమిడిపోయింది. దీంతో విద్యార్థులు ఈ భోజనాన్ని తినకుండా బయటపడేశారు. ఇంతా జరుగుతున్నా వార్డెన్ పట్టించుకోనేలేదు. బాలికలు అర్ధాకలితోనే ఉండిపోవాల్సి వచ్చింది. కైకలూరు, మండవల్లి బీసీ బాలుర వసతి గృహాల్లో సాంబారు నీళ్లను తలపించింది. మెనూ ఎక్కడా అమలు కావడం లేదు.
పామర్రు ఎస్సీ బాలుర వసతి గృహంలో 46 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా కేవలం తొమ్మిది మందే ఉన్నారు. వీరికి కూడా కూర వండకుండా సాంబారు, గుడ్డుతో సరిపెట్టారు.
కూచిపూడి బీసీ బాలుర వసతి గృహంలో భోజనం అంతగా బాగోలేదు. సాంబారు పలచగా వండారు.
ఘంటసాల మండలం శ్రీకాకుళం ఎస్సీ బాలికల వసతి గృహంలో గుడ్డు వడ్డించలేదు. నాగాయలంకలోని ఎస్సీ బాలికల వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. గదులు చిన్నవిగా ఉండటంతో విద్యార్థినులు ఇక్కట్లపాలవుతున్నారు. గ్యాస్ లేకపోవటంతో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు.
గన్నవరం బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం అమలుచేయాల్సిన మెనూను సోమవారం అమలు చేశారు. ఎస్సీ బాలుర ప్రత్యేక వసతి గృహంలో భోజనశాల ఉన్నా ఆరుబయటే భోజనం వడ్డిస్తున్నారు.
‘సాక్షి’ కథనాలపై కలెక్టర్ ఆరా
జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ విలేకరుల బృందం ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి అక్కడ విద్యార్థులు పడుతున్న అగచాట్లపై సోమవారం దినపత్రికలో ‘గాలిలో సంక్షేమం-చలితో సహవాసం’ శీర్షికతో ప్రచురించిన కథనానికి కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పందించారు. హాస్టళ్లను ఏఎస్‌డబ్ల్యూవోలు ఎన్ని రోజులకొకసారి సందర్శిస్తున్నారు.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు.. తదితర అంశాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావును ఆదేశించారు. దీనిపై నివేదికలు త్వరగా తయారుచేసి ఇవ్వాలని ఆయన జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జేడీ మధుసూదనరావుకు సూచించారు.