జూలో భద్రత ఇక కట్టుదిట్టం
న్యూఢిల్లీ: సందర్శకులకు ఇకపై కట్టుదిట్టమైన భద్రత కల్పించే అంశం ఢిల్లీ జంతుప్రదర్శనశాల యంత్రాంగం పరిశీలనలో ఉంది. రెండురోజుల క్రితం 20 ఏళ్ల మక్సూద్ అనే యువకుడిని తెల్లపులి విజయ్ చంపిన సంగతి విదితమే. ఈ విషయమై జూ వెటర్నరీ అధికారి పన్నీర్ సెల్వన్ మాట్లాడుతూ ‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక జాగ్రత్త చర్యలను రూపొందిస్తున్నాం. ఈ జూకు ప్రతిరోజూ దాదాపు 1,300 మంది సందర్శకులు వస్తుంటారు. అయితే ఘటన జరిగిన మరుసటిరోజు రికార్డుస్థాయిలో దాదాపు మూడు వేలమంది వచ్చారు. అందువల్ల పులుల ఎన్‌క్లోజర్ ఎత్తును ఆరు అడుగుల మేర పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం దీని ఎత్తు నాలుగు అడుగులని తెలిపారు.
సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకాలను అనుసరించి అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు’ అని అన్నారు. ఇదిలాఉంచితే తెల్లపులులు ఉన్నచోట ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. ఈ జూలో మొత్తం రెండు మగ, నాలుగు ఆడ పులులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలైవరకూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 80 మంది సందర్శకులకు సంబంధిత అధికారులు జరిమానా విధించిన సంగతి విదితమే. కాగా స్థానిక జంతుప్రదర్శనశాలలో సందర్శకుల భద్రత కోసం తీసుకున్న చర్యలను వివరాలు కావాలంటూ కేంద్రంతోపాటు సెంట్రల్ జూ అథారిటీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో గురువారం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైంది. ఈ పిల్ వచ్చే నెల ఒకటో తేదీన విచారణకు రానుంది. సునీల్‌కుమార్ అనే ఓ అడ్వొకేట్ దీనిని దాఖలు చేశారు.