నివాసయోగ్య గ్రహం గుర్తింపు!
మెల్బోర్న్: ఆవాసానికి అనువైన వూల్ఫ్ 1061సీ అనే గ్రహాన్ని గుర్తించినట్లు ఆస్ట్రేలియా ఖగోళ పరిశోధకులు ప్రకటించారు. మన సౌర వ్యవస్థ నుండి కేవలం 14 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమి కంటే నాలుగు రెట్లు ద్రవ్యరాశి ఎక్కువగా ఉండి జీవులు నివసించడానికి అనువైన వాతావరణంతో ఉందని వెల్లడించారు.
సౌర కుటుంబానికి దగ్గరలో ఉన్న రెడ్ డ్వార్ఫ్ స్టార్ అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న మూడు గ్రహాలను కనుగొన్న పరిశోధకులు, మధ్యలో ఉన్నటువంటి 1061సీ గ్రహంలో నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రహంలో నీటి జాడ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డంకన్ రైట్ తెలిపారు.
విశాలంగా ఉన్నటువంటి ఈ గ్రహం నివాసయోగ్యంగా ఉండటం, మన సౌరవ్యవస్థకు అత్యంత సమీపంలో దీనిని గుర్తించడం ఆసక్తిగా ఉందన్నారు. 1061సీ గ్రహం ఉపరితలం ఎక్కువ భాగం రాళ్లతో ఉన్నప్పటికీ, కొంత భాగంలో నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.